TEJA NEWS

కన్నుల పండుగగా శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి కళ్యాణం

సూర్యాపేట జిల్లా (పిల్లలమర్రి): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఏకాదశి సందర్భంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి మాస కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అర్చకులు ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలు అలంకరించి తదుపరి కళ్యాణ మహోత్సవం జరిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు మాట్లాడుతూ ఆలయంలో ప్రతి ఏకాదశి నాడు శ్రీ భూ నీల సమేత చెన్నకేశవ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి మాస కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని తెలిపారు.

లోక సంరక్షణార్థం నిర్వహించే మహోత్తర కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించి తరించగలరని కోరారు.దేవాలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వామ్యం కావాలని ప్రాచీన ఆలయాలకు పిల్లలమర్రి ప్రసిద్ధి గాంచిందని ఈ సందర్భంగా తెలిపారు.ఆలయంలో చెన్నకేశవ స్వామి ఉత్తర ముఖంగా కొలువుదీరి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా స్వామి ఇక్కడ విరాజిల్లుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ గుకంటి రాజబాబు, భక్తులు అంకం భిక్షం మల్లీశ్వరి,గవ్వ అహల్య, మెరెడ్డి సువర్ణ,దేవరశెట్టి పద్మ,చుక్కమ్మ,యాదమ్మ,మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.