
చెత్త నిర్వహణ విధానం సూపర్
** తిరుపతిలో కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి బృందం
తిరుపతి: తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త నిర్వహణ ప్లాంట్లను కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ బృందం గురువారం ఉదయం పరిశీలించారు. ఉదయం కేంద్ర కార్యదర్శి తో పాటు సంయుక్త కార్యదర్శి (అమృత్ పథకం) ఇషా కాలియా, సాంకేతిక సలహాదారుడు రోహిత్ కక్కర్, రాష్ట్ర కార్యదర్శి సురేష్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య లు నగరపాలక సంస్థ అధికారులతో కలసి తూకివాకం , రామాపురం చెత్త నిర్వహణ ప్లాంట్లను పరిశీలించారు. తిరుపతి నుంచి తూకివాకం వరకు మురుగునీరు సరఫరా అయ్యే భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ రేణిగుంట మార్గంలో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం తూకివాకం వద్ద గల మురుగునీటి శుద్ధి కేంద్రం, తడి, పొడి చెత్త, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను పరిశీలించారు. మురుగునీరు శుద్ది చేసి ప్రైవేట్ ఫ్యాక్టరీ లకు, పంటలకు సరఫరా చేస్తున్నామని కమిషనర్ వివరించారు. అలాగే తడి చెత్త తో ఎరువు, గ్యాస్ తయారు చేయడం, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ను వివరించారు.
అనంతరం రామాపురం వద్ద గల బయో మైనింగ్ ప్లాంట్ ను పరిశీలించారు. ఇక్కడ చెత్త నిర్వహణ చేయగా వచ్చిన ఎరువును పొలాలకు, ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తామని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వహణ పట్ల కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసి, అభినందించారు. కేంద్ర బృందం వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి , మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డి.ఈ.లు మధు, రమణ, తదితరులు ఉన్నారు.
