
నేర నియంత్రణలో టెక్నాలజీ కీలకం
గడువులోపు ప్రతి కేసు పూర్తి చేయాలి…
– పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, ప్రతి కేసు గడువులోపు పూర్తి చేయాలి.. నేర నియంత్రణలో సాంకేతికత కీలకం
సీసీటీఎన్ఎస్ 2.0, ఈ-సాక్ష్య అమలును వేగవంతం చేయాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మే నెల నేర సమీక్షా సమావేశం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, పోలీసు సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు.
ఇప్పటివరకు నమోదైన కేసులు, పెండింగ్‌లో ఉన్న పాత కేసులపై సీపీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలో నమోదవుతున్న ప్రతి కేసులో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అవసరమైతే న్యాయ సలహా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఆస్తి సంబంధిత నేరాలు, ఆర్థిక నేరాల కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆస్తుల గుర్తింపు, స్వాధీనం, అటాచ్‌మెంట్ ప్రక్రియలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మహిళలకు సంబంధించిన తీవ్రమైన కేసుల్లో నిందితుల అరెస్టులను ఆలస్యం చేయరాదని, గ్రేవ్ కేసులు, ఎన్‌డీపీఎస్ కేసులను డీసీపీలు, ఏసీపీలు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
పెండింగ్ నాన్-బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రతిరోజూ పర్యవేక్షణ నిర్వహించాలని, చిన్నచిన్న నేరాలపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులు, సీసీసీ పిటిషన్ల విచారణలో క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిర్ధారించి పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. దర్యాప్తు ప్రక్రియ పూర్తిగా నమోదు చేసిన అనంతరమే కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్‌కు ఎవరినీ అనవసరంగా పిలవరాదని, అరెస్టుల విషయంలో ఎస్‌ఓపీని కచ్చితంగా పాటించాలని సూచించిన కమిషనర్, పోలీసుల ప్రవర్తనే శాఖ ప్రతిష్ఠను నిర్ణయిస్తుందని హెచ్చరించారు. ప్రతి ఎస్‌హెచ్‌ఓ, సీఐ స్థానిక ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ విశ్వాసాన్ని పెంపొందించాలని తెలిపారు.
వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, తాళ్లు, కోన్స్, క్రైమ్ ప్రొటెక్షన్ రిబ్బన్, రైట్ గేర్ కిట్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు, వరదలలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ముందస్తు అప్రమత్తతతో వ్యవహరించాలని, ప్రమాద సమయంలో రక్షణ చర్యలపై తరచూ డ్రిల్ ప్రాక్టీస్ నిర్వహించాలని ఆదేశించారు.
సీసీటీఎన్ఎస్ సిబ్బందితో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు, కేసుల నిర్వహణలో పారదర్శకత, వేగాన్ని పెంపొందించేందుకు సీసీటీఎన్ఎస్ 2.0, ఈ-సాక్ష్య వ్యవస్థలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. సీసీటీఎన్ఎస్ 2.0 ద్వారా నేరాలు, నేరస్థుల సమాచారాన్ని వేగవంతంగా నమోదు చేయడం, దర్యాప్తు ప్రక్రియను డిజిటలైజ్ చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ-సాక్ష్య వ్యవస్థ ద్వారా డిజిటల్ ఆధారాల సేకరణ, భద్రపరిచే విధానం మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి డేటా ఫీల్డ్ రియల్ టైమ్‌లో నవీకరించబడాలని, సమాచారం ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎఫ్‌ఐఆర్‌లు, నేర వివరాలు, చార్జ్‌షీట్లు, శాస్త్రీయ ఆధారాలు తదితర అంశాలను నిర్దిష్ట సమయంలో అప్డేట్ చేయాలని సూచించారు.
సీసీటీఎన్ఎస్‌లో డేటా అప్లోడ్ పెండింగ్ లేకుండా పనిచేసే సిబ్బందికి రివార్డులు కూడా అందజేస్తామని కమిషనర్ తెలిపారు.
ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి, అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.