TEJA NEWS

ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఫెయిల్ అయితే ఉపాధ్యాయులే బాధ్యత వహించాలి

రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లా 29వ స్థానం పొందటం పై కలెక్టర్ మండిపాటు


వనపర్తి జిల్లా
వచ్చే సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ కాకుండా ఉపాధ్యాయులు ఉత్తమ బోధన అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యా శాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. విద్యాపర్తిగా పేరుగాంచిన వనపర్తి జిల్లా పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 29వ స్థానం పొందటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కలెక్టర్ మండిపడ్డారు.
ఉత్తీర్ణతలో వెనుకబడ్డ ఉపాధ్యాయులను పిలిపించి శిక్షణ కార్యక్రమం చేపట్టాల్సిందిగా విద్యా అధికారిని ఆదేశించారు.


అదేవిధంగా ప్రస్తుతం 9వ తరగతిలో గణితంలో వెనుకబడి ఉన్న విద్యార్థుల జాబితా సేకరించి జూన్ 12 నుంచి నెల రోజులపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.

వచ్చే 10 వ తరగతి వార్షిక పరీక్షల్లో ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ కావడానికి వీలు లేదని, ఉపాధ్యాయులు బాధ్యత తీసుకొని విద్యార్థులకు తగిన రీతిలో బోధించాలని ఆదేశించారు.
విద్యార్థులు ఫెయిల్ అయితే సంబంధిత సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
జిల్లా విద్యా అధికారి అబ్దుల్ ఘని, ఎ.సి.జి. గణేష్, మండల విద్యా అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.