ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దడమే లక్ష్యం….

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దడమే లక్ష్యం….

పెద్దపల్లి నియోజకవర్గ విద్యాభివృద్ధికి రూ.50 కోట్ల కేటాయింపు…..

–ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు…

పెద్దపల్లి –జిల్లా ప్రతినిధి, కాల్వ శ్రీరాంపూర్ |

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్ది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం, ఉషన్నపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆయన ఉషన్నపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని, కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అలాగే గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రజలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు సరైన భవనం లేక కేవలం 20 మంది విద్యార్థులతో కొనసాగిన ఉషన్నపల్లి పాఠశాల నేడు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల కృషితో 56 మంది విద్యార్థులతో అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల సంఖ్యను 75కు పెంచే దిశగా కృషి చేయాలని సూచించారు.

పాఠశాలకు విద్యుత్ ఖర్చు తగ్గించేందుకు సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్న ఆయన, విద్యుత్ వినియోగం అనంతరం మిగిలే ఆదాయం నేరుగా పాఠశాల అభివృద్ధికే వినియోగించబడుతుందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పెద్దపల్లి నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా నిధులు వెచ్చించామని తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత పదేళ్లలో స్కూల్ భవనాల నిర్మాణానికి సరైన నిధులు ఖర్చు కాలేదని, అయితే తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే స్కూల్ భవనాలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి రూ.5 నుంచి రూ.6 కోట్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) విస్తరణకు రూ.2.5 కోట్లు మంజూరు చేసిందన్నారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు దసరా నాటికి అల్పాహారం (టిఫిన్) అందించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని వెల్లడించారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు గంగారం టర్నింగ్ మెయిన్ రోడ్డు నుంచి ఉషన్నపల్లి మీదుగా పందిళ్ల చౌరస్తా వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే శ్రీరాంపూర్ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి ఉషన్నపల్లి ఎస్సీ కాలనీ వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారాన్ని తగ్గించుకునేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాముడు, ఎంఈఓ మహేష్, ఎంపీడీవో సురేందర్, మాజీ ఎంపీపీ గొపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ రేకుల జ్యోతి రఘు, ఉపసర్పంచ్ మేడి అశోక్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనమైన సదయ్య, ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top