
భారతీయుల పురాతన సంపదైన యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. – కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్
యోగాంధ్ర లో అందరూ భాగస్వాములు కావాలి. – ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
భారతీయుల పురాతన సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్.మౌర్య, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు నరసింహ ఆచారి లు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక కృష్ణాపురం ఠాణా నుండి నలుగుకాళ్ల మండపం వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెల రోజుల ఆటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నం లో నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని అన్నారు. నెలరోజులు పాటు యోగాపై ప్రజలకు అవగాహన, ప్రయోజనాలు వివరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొంచామని అన్నారు. ఈ నెల 21 న మహిళా వర్సిటీలో యోగా దినోత్సవాన్ని ప్రారంభించామని, అప్పటి నుండి ప్రతి రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నెల 29 నుండి జూన్ 19 వరకు జిల్లాలోని తిరుమల, శ్రీహరికోట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, ఎస్వీ జూ పార్కు లో సుమారు వెయ్యి మందితో యోగా ప్రాముఖ్యతను తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. రాష్ట్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 10 న తిరుమలలో 5వేల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.
ప్రతి మండలానికి నలుగురు మాస్టర్ ట్రైనర్లు 200 మందికి శిక్షణ ఇచ్చి సుమారు 10 లక్షల మందికి యోగా యొక్క ప్రయోజనాలు, ప్రాముఖ్యత తెలిసేలా చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం అయ్యేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జూన్ 21న విశాఖపట్నం లో సుమారు ఐదు లక్షల మంది తో యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని అన్నారు. మునిసిపల్, మండల, గ్రామ స్థాయిలో జరిగే యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ యోగాంధ్ర యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపి అందరికీ యోగా పట్ల అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. నెల రోజుల పాటు పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందిరా మైదానం, వినాయక సాగర్ లో ప్రతి రోజు ఉదయం శిక్షకులచే యోగా చేస్తున్నారని ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసీమ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
