
శక్తిని సందర్శించిన సుందరీమణులు
ఇది బజార్ కాదు.. శక్తి కేంద్రం అన్న సుందరీమణులు
తెలంగాణ మహిళల శక్తినీ నింపుకొని సాధికారత ,సామాజిక మార్పు సందేశాన్ని ప్రపంచ దేశాల్లో ప్రచారం చేయాలని మిస్ వరల్డ్ పోటీదారులను కోరిన మంత్రి సీతక్క
తెలంగాణలో ఓ ప్రత్యేకమైన ఉదయం. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ వద్ద గల శిల్పారామం లోని ఇందిరా మహిళా శక్తి బజార్ లో గురువారం ఉదయం నుంచి సందడి. ఆ రోజు ప్రత్యేకం, ఎందుకంటే ప్రపంచ అందాల రాణులు — మిస్ వరల్డ్ పోటీదారులు — భారతదేశంలోని ఓ సామాన్య బజార్‌ను సందర్శించేందుకు వచ్చారు. కానీ ఇది సాధారణ బజార్ కాదు. ఇది మహిళా శక్తికి, ఆత్మవిశ్వాసానికి, ఆర్థిక సాధికారతకు చిహ్నం.
బజార్‌లో అడుగుపెట్టిన మిస్ వరల్డ్ పోటీదారుల ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం. ఒక్కో స్టాల్ చుట్టూ తిరుగుతూ వారు చూసినది ఉత్పత్తులు మాత్రమే కాదు, ఒక్కో మహిళ కథ. మహిళ మణుల కలలు, కష్టాలు, విజయాలు.
ఈ సందర్భంగా, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పోటీదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె ప్రసంగం గుండెను తాకేలా ఉంది.
“ఇది కేవలం బజార్ కాదు..ఇది శక్తి కేంద్రం, మార్పునకు చిహ్నం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా పనిచేస్తోంది. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛే నిజమైన స్వాతంత్ర్యం. ఇందిరా మహిళా శక్తి బజార్ ఆ స్వాతంత్ర్యాన్ని బలపరుస్తోంది” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
పురాతన నాగరికతల కాలంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేదని గుర్తు చేసిన ఆమె, కాల క్రమంలో మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోల్పోయినప్పటికీ, ఇప్పుడు తిరిగి అన్ని రంగాల్లో రాణిస్తుండటం ఎంతో గర్వకారణం అన్నారు.
“మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం
సాంస్కృతిక మార్పుకు సంకేతంగా నిలుస్తోంది. అందం అంటే కేవలం రూపం కాదు..అది శక్తి, మేధస్సు, స్థితప్రజ్ఞతల సమ్మేళనం” అన్నారు సీతక్క.
బజార్ మొత్తం చూసిన మిస్ వరల్డ్ పోటీదారులు ప్రతి మహిళతో మాట్లాడారు. వారు చూసిన ప్రతి స్టాల్ వెనుక ఓ సక్సెస్ స్టోరీ. ఒక్కరైతే బస్సు ఓనర్. ఇంకొకరు పౌల్ట్రీ వ్యాపారం నిర్వహించే నిర్వాహకురాలు. ఒక్కొక్కరి గొంతు వెనుక ఒక గొప్ప గాథ ఉంది.
46 లక్షల మంది మహిళలు వడ్డీ లేని రుణాలతో వ్యాపారాలు చేస్తూ సంపద సృష్టిస్తున్నారు. వారు తీసుకున్న లోన్లు 100% తిరిగి చెల్లిస్తున్నారనీ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
అంతర్జాతీయ అతిథుల ముఖాల్లో ఆశ్చర్యం మెరిపింది. వారంతా బజార్‌ను సందర్శించిన తర్వాత ఇది నిజమైన శక్తి కేంద్రం అని కొనియాడారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ Earn, Empower, Evolve లక్ష్యంగా సామాజిక మార్పు కోసం ఇందిరా మహిళా శక్తి బజార్ పనిచేస్తుందని తెలిపారు.
తెలంగాణ మహిళలు చరిత్రను తిరగరాస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ మహిళల శక్తి మీలో నింపుకొని సాధికారత ,సామాజిక మార్పు సందేశాన్ని ప్రపంచ దేశాల్లో ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు మంత్రి సీతక్క. జైహింద్, జై తెలంగాణ, జై ఇందిరా మహిళా శక్తి అంటూ తన ప్రసంగాన్ని ముగించారు మంత్రి సీతక్క.
అంతకుముందు సెర్పు ఉద్దేశాలను లక్ష్యాలను సీఈవో దివ్య దేవరాజన్ వివరించారు. మహిళా సంఘాలు సాధించిన ప్రగతిని విజయాల డాక్యుమెంటరీనీ ప్రదర్శించారు. మహిళా సంఘాల చే రూపొందించిన వస్తువులను మిస్ వరల్డ్ పోటీదారులకు బహుకరించారు నిర్వాహకులు.
