
ముఖ్యమంత్రి కష్టాన్ని, ఆలోచనల్ని అధికారులు గుర్తించకపోతే ఎలా? : మాజీమంత్రి ప్రత్తిపాటి
- సమస్య పరిష్కరించకుండా చేసినట్టు ప్రజల్ని నమ్మించి చంద్రబాబు కష్టంపై నీళ్లు చల్లకండి: ప్రత్తిపాటి
- కేవలం దోపిడీ కోసమే గత పాలకులు ఒక్క మండలంలో 17 వేల ఎకరాల రైతుల భూముల్ని నిషేధిత భూముల్లో చేర్చారు : ప్రత్తిపాటి
- తమ సమస్యను రైతులు గుర్తించే వరకు అధికారులు ఉదాసీనంగా ఉంటే ఎలా? : ప్రతిపాటి
- ప్రజాసమస్యల పరిష్కారవేదికలపై ప్రజలిచ్చే అర్జీల పరిష్కారంపై అధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేసిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
- ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన P-4 సత్ఫలితాలు ఇవ్వాలంటే ప్రవాసాంధ్రులు మార్గదర్శులుగా మారాలి : ప్రత్తిపాటి.
గత ప్రభుత్వ భూ తప్పిదాలు.. రెవెన్యూ సమస్యలు నేడు రైతుల మెడకు చుట్టుకొని వారిని ఇబ్బంది పెడుతున్నాయని, ప్రజల సమస్యల్ని సరైన విధంగా పరిష్కరించకుండా, చేసినట్టు ప్రభుత్వాన్ని నమ్మించే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చే సమస్యల్ని అధికారులకు తెలియచేస్తామని, అలానే మీ దృష్టికి కొన్ని సమస్యలు వస్తాయని, అవన్నీ కచ్చితంగా పరిష్కరించబడితేనే మీకు, మాకు, ప్రభుత్వానికి ప్రజల్లో మంచిపేరు వస్తుందనే వాస్తవాన్ని అధికారయంత్రాంగం గుర్తించాలని ప్రత్తిపాటి సూచించారు.
నాదెండ్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో పాల్లొన్న మాజీమంత్రి దృష్టికి రైతులు తమ భూములు నిషేధిత జాబితాలో చేర్చడంపై ఫిర్యాదు చేశారు. రైతులు తెలియచేసిన సమస్యపై ప్రత్తిపాటి తీవ్రంగా స్పందించారు. అప్పటికప్పుడే 17వేల ఎకరాల నిషేధిత జాబితాపై పల్నాడు కలెక్టర్ని ఫోన్ లో సంప్రదించిన ఆయన సమస్యపరిష్కారంపై దృష్టి పెట్టి, రైతులకు న్యాయంచేయాలన్నారు. మాజీమంత్రి సూచనపై స్పందించిన కలెక్టర్, పూర్తి సమాచారం తెలుసుకొని సమస్య పరిష్కారానికి అన్నిచర్యలు తీసుకుంటానని చెప్పారు.
కేవలం దోపిడీ కోసమే 17 వేల ఎకరాల రైతుల భూములు నిషేధిత జాబితాలోకి చేర్చారు..
గత ప్రభుత్వం చేసిన అసమగ్ర, అసంబద్ధ భూ సర్వేవల్ల ఒక్క నాదెండ్ల మండలంలోనే రైతుల భూములు 17 వేల ఎకరాలు నిషేధిత భూముల జాబితాలోకి (22ఏ, ఇనామ్) చేర్చబడ్డాయని, రైతులు సమస్యను గుర్తించేవరకు అధికారులు ఏంచేస్తున్నారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల సమక్షంలోనే ప్రత్తిపాటి సమస్యను పల్నాడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నిషేధిత జాబితాలో చేర్చడంతో భూములు సాగుచేసుకోవడానికి అసలు హక్కుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రత్తిపాటి కలెక్టర్ ను కోరారు. సమస్యను మండలస్థాయి అధికారులు గుర్తించకపోవడంపై ప్రత్తిపాటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంత తీవ్రమైన సమస్యపై అధికారులు దృష్టి పెట్టకపోతే ఎలాగన్న ఆయన మూలాల్లోకి వెళ్లి, పరిష్కారమార్గాలు వెతకాలని యంత్రాంగానికి సూచించారు. తీవ్రమైన సమస్యలు పరిష్కరిస్తేనే అధికారుల పనితీరు ఏంటో ప్రజలకు తెలుస్తుందని, ఉదాసీనంగా వ్యవహరించకుండా తక్షణమే సమస్యపై తక్షణమే దృష్టి పెట్టాలని ప్రత్తిపాటి ఆదేశించారు.
సమస్యలు పరిష్కరించకుండా చేసినట్టు నివేదికలు పంపడం సరైన పద్ధతి కాదు…
ఒక ప్రణాళిక, సరైన ఆలోచన లేకుండా కేవలం మొక్కుబడిగా గత పాలకులు చేసిన భూ సర్వే రాష్ట్రవ్యాప్తంగా సమస్యల్ని తీసుకొచ్చిందన్నారు. జరిగిన దాని గురించి ఆలోచించకుండా, ప్రజా సమస్యల పరిష్కారానికి మనమేం చేయాలనే దానిపై అధికారులు దృష్టి పెట్టాలని ప్రత్తిపాటి చెప్పారు. ప్రజలు ఇచ్చే అర్జీలను బుట్టదాఖలు చేస్తే సహించేది లేదని, అలానే సమస్యల్ని సరిగ్గా పరిష్కరించకుండా, పరిష్కారం చేసినట్టు ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి నివేదికలు పంపడం ఎంతమాత్రం సరైన పద్ధతి కాదని ప్రత్తిపాటి అధికారయంత్రాగానికి స్పష్టంచేశారు.
ప్రజలకు న్యాయం చేస్తేనే అధికారులకు, ప్రభుత్వానికి ప్రజల్లో మంచిపేరు..
చేయగలిగే పనులు చేయకుండా, కాలయాపనతో ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేయవద్దని, చంద్రబాబు కష్టాన్ని అధికారులు కూడా అర్థం చేసుకోవాలని ప్రత్తిపాటి హితవుపలికారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని తెలిసి, ప్రజలు పనులు మానుకొని దూరాభారాల్ని భరిస్తూ తమ సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకంతో వస్తారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ప్రత్తిపాటి తెలిపారు. సాంకేతిక ఇబ్బందులు, క్షేత్రస్థాయి సమస్యలున్నా.. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలన్నారు. గ్రీవెన్స్ అంటే తమ సమస్యలు కచ్చితంగా పరిష్కారం అవుతాయనే నమ్మకం, విశ్వాసం ప్రజల్లో కలిగేలా అధికారులు వారికి న్యాయం చేస్తేనే మీతోపాటు పాలకులకు మంచిపేరు వస్తుందని మాజీమంత్రి స్పష్టం చేశారు.
అనధికార లే అవుట్లను ఉపేక్షించవద్దు..
అనధికార లే అవుట్లను ఉపేక్షించేది లేదని, ప్రజల్ని మోసగించి తాము లబ్ధిపొందుదామనే వారిని ఉపేక్షించడం ఎంతమాత్రం సరైంది కాదని ప్రత్తిపాటి అధికారులకు స్పష్టంచేశారు. నియోజకవర్గంలోని అనధికార లే అవుట్లను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాటి అదికారుల్ని ఆదేశించారు. నిబంధనల ప్రకారం లే అవుట్లు వేసి, మార్గదర్శకాల ప్రకారం అన్నివసతులతో అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు ఫిర్యాదు చేస్తారని ప్రత్తిపాటి ప్రశ్నించారు.
పేద కుటుంబాల్ని ఆదుకోవడం .. బాధ్యతగా భావించండి…
విదేశాల్లో ఉండేవారు పేద కుటుంబాలను దత్తత తీసుకొని పేదల జీవితాలు మార్చడమనే గొప్ప ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దాన్ని వివిధ రంగాల్లో స్థిరపడి, ఆర్థికంగా బలపడిన వారు తమ బాధ్యతగా భావించాలని ప్రత్తిపాటి తెలిపారు. గ్రామాలకు చెందిన ప్రవాసాంధ్రులు తమఊళ్లలో ఉండే పేదలకు చేయాల్సిన సాయం చేయాలని, అప్పుడే ముఖ్యమంత్రి తలపెట్టిన P-4 విధానం సత్ఫలితాలు ఇస్తుందన్నారు. ఒక్కొక్కరు ఒకటి నుంచి 2 లేదా3 కుటుంబాలను దత్తత తీసుకోవాలన్నారు. పేద కుటుంబాలను దత్తత తీసుకునేవారిని ముఖ్యమంత్రికి పరిచయం చేసి, వారికి తగిన గుర్తింపు వచ్చేలా చూస్తానని ప్రత్తిపాటి తెలిపారు.
అధికారులు ఇతర సిబ్బంది తమపనితీరు మార్చుకోకుంటే చర్యలు తీసుకుంటాను…
నియోజకవర్గంలోని రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్.. ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది తమ పనితీరు మార్చుకోవాలని, ప్రజల నుంచి కూటమి నాయకులు నుంచి ఫిర్యాదులు వస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రత్తిపాటి తెలిపారు. ప్రజాప్రతినిధులైన తామైనా.. అధికారులైనా ప్రజలకు సేవచేయడానికే ఉన్నామనే వాస్తవాన్ని విస్మరించడం ఎవరికీ మంచిదికాదని ప్రత్తిపాటి హితవుపలికారు.
కార్యక్రమంలో అధికారులు తహశీల్దార్ రమణ, ఎంపీడీవో స్వరూప రాణి, ఎంపీపీ తలతోటి రాణి, విద్యుత్ ఏ.డి కొండలు, సి.ఐ సుబ్బానాయుడు, నాయకులు నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, నల్లమోతు హరిబాబు, మొగిలి నాగలక్ష్మి, గంగా శ్రీనివాసరావు , హిమవంత్ రావు, కందుల రమణ, తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
