
దేశం యావత్తు సైనికుల వెంటే….!
** సైనికుల కోసం “మేము సైతం” అన్న భారతావని…
తిరుపతి: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తిరుపతి నగరంలో భారతదేశ సైనికులకు సంఘీభావంగా శుక్రవారం “తిరంగా ర్యాలీ” దేశాభిమానులతో కలసి నిర్వహించారు. తిరుపతి నగరంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బిజెపి, టిడిపి, జనసేన పార్టీ నాయకులు… శ్రేణులు మాజీ సైనికులు, ముస్లిం మైనారిటీలు, సామాజిక వేత్తలు, వస్త్ర వ్యాపారస్తుల సంఘం, పారిశ్రామికవేత్తలు, ప్రజా సంఘాలు యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని “జై జవాన్”…. “భారత్ మాతాకీ జై హింద్” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ జాతీయ జెండాతో ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను “ఆపరేషన్ సింధూర్” తో ఆడపడుచుల నుదుటున పసుపు కుంకుమలను చెరిపేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను, మానవ మృగాలను మట్టికరిపించి ప్రపంచ దేశాలకు భారత్ సైనికుల సత్తాను చాటారని కొనియాడారు.
భారత దేశంలో 140 కోట్ల మంది ప్రజలు కంటి నిండా గుండెల పై చేయి వేసుకొని నిద్రపోతున్నారంటే దానికి ప్రధాన కారణం భారత దేశ సరిహద్దులలో మన సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ ప్రజలను రక్షిస్తున్నారని వారికి 140 కోట్ల మంది భారతీయులు కుల, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా “భారతదేశమంతా మీ వెంటే” అంటూ తిరంగా ర్యాలీ ద్వారా దేశవ్యాప్తంగా సంఘీభావం తెలుపుతున్నారన్నారు.
నరేంద్ర మోడీ నాయకత్వంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశాన్నయినా భారతదేశం ఉపేక్షించదని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలకు ఓ హెచ్చరిక చేశారన్నారు. ఆపరేషన్ సింధూర్ లో అమరవీరులైన భారత్ సైనికులకు జోహార్లు…. “అమర్ రహే”…. అంటూ శ్రద్ధాంజలి ఘటించారు.
