TEJA NEWS

యిక భూమి వివ‌రాలు ఎంతో సుల‌భం
ఎన్ ఆర్ ఎస్ సీతో హైడ్రా ఒప్పందం
ఎంఓయూ పై ఇరు సంస్థ‌లు సంత‌కం

🔶ఓఆర్ ఆర్ ప‌రిధిలో భూముల వివ‌రాలు అంద‌రికీ అందుబాటులోకి తీసుకురాడానికి హైడ్రా క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఎక్క‌డ చెరువు ఉంది.. ఆ చెరువు విస్తీర్ణం ఎంత‌, కాలువలు, నాలాల‌ ప‌రిస్థితి ఏంటి..? అనే స‌మాచారంతో పాటు ప్ర‌భుత్వ భూములు, పార్కులకు సంబంధించి స‌రైన హ‌ద్దుల‌తో స‌మాచారాన్ని సేక‌రిస్తోంది. ఈ క్ర‌మంలో ఎన్ ఆర్ ఎస్ సీ (నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్‌)తో హైడ్రా శుక్ర‌వారం ఒప్పందం కుదుర్చుకుంది. హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌గారు, ఎన్ ఆర్ ఎస్ సీ డైరెక్ట‌ర్ డా. ప్ర‌కాష్ చౌహాన్ ఈ ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు. చెరువుల ఎఫ్ టీ ఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల‌కు సంబంధించి హ‌ద్దుల విష‌యంలో ఎలాంటి అపోహ‌ల‌కు ఆస్కారం లేకుండా స‌రైన స‌మాచారం అందించ‌డ‌మే హైడ్రా ముందున్న ల‌క్ష్య‌మ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ చెప్పారు. ప్ర‌భుత్వ స్థ‌లాలు, పార్కులు, ర‌హ‌దారులు ఇలా ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల స‌మాచారం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురాడానికి ఎన్ ఆర్ ఎస్ సీతో నేడు కుదుర్చుకున్న ఒప్పందం మైలురాయి లాంటిద‌న్నారు. 1970వ సంవ‌త్స‌రంలో స‌ర్వే ఆఫ్ ఇండియా స‌ర్వే చేసిన టోపో షీట్లు, కెడెస్ట్రియ‌ల్ మ్యాప్స్‌, రెవెన్యూ రికార్డులు, చెరువుల‌కు సంబంధించిన స‌మాచారంతో పాటు ఎన్ ఆర్ ఎస్ సీ శాటిలైట్ ఇమేజీల‌తో స‌మ‌గ్ర స‌మాచారం అందుబాటులోకి తీసుకురావ‌డ‌మే హైడ్రా ల‌క్ష్య‌మ‌న్నారు. చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌, ప్ర‌భుత్వ స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన న‌గ‌రాన్ని రూపొందించ‌డానికి ఇంత పెద్ద‌యెత్తున చ‌ర్య‌లు తీసుకున్న మొద‌టి రాష్ట్రంగా తెలంగాణ నిల‌బడుతుంద‌ని ఎన్ ఆర్ ఎస్ సీ డైరెక్ట‌ర్ డా. ప్ర‌కాష్ చౌహాన్ అన్నారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకుంటే.. దేశంలోనే గొప్ప న‌గ‌రంగా హైద‌రాబాద్ పేరుగాంచుతుంద‌ని అన్నారు. హైడ్రా చ‌ర్య‌ల‌తో ఇది సాధ్య‌మౌతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంలో హైడ్రాకు పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌న్నారు.

ఎన్ ఆర్ ఎస్ సీ తో ఒప్పందం.. ఫ‌లితాలు:
🔶విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, నీటి వ‌న‌రుల ర‌క్ష‌ణ కోసం జియో ఆధారిత జియోస్పేషియల్ డేటా మద్దతు, సాంకేతిక స‌హ‌కారం హైడ్రాకు అందుతుంది.
🔶రిమోట్ సెన్సింగ్ & GIS సాంకేతికతను వినియోగించి తెలంగాణ కోర్ అర్బ‌న్ రీజియ‌న్‌(టీసీయూఆర్‌) కోసం భౌగోళిక డేటాబేస్‌లను సమగ్రపరిచే భౌగోళిక పోర్టల్ అభివృద్ధితో పాటు జియోస్పేషియల్ డేటాబేస్ సృష్టికి NRSC సాంకేతిక మద్దతును HYDRAA కి అందిస్తుంది.
🔶భువాన్ పోర్టల్‌లో ఉన్న TCUR ప‌రిధిలో విపత్తు నిర్వహణ మరియు నీటి వనరుల రక్షణకు సంబంధితంగా ఉండే అన్ని వారసత్వ సమాచారాన్ని ఈ ఒప్పందం ప్ర‌కారం NRSC అందించడానికి సిద్ధంగా ఉంటుంది.
🔶కొత్త ‘జియోస్పేషియల్ డేటా పాలసీ – 2023’ కు అనుగుణంగా ‘భూనిధి’ పోర్టల్‌లో ఉన్న అన్ని చారిత్రక భారతీయ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ డేటా TCUR ప్రాంతాన్ని కవర్ చేసే మార్గదర్శకాలు అందుబాటులోకి వ‌స్తాయి.
🔶హై-రిజల్యూషన్ ఉపగ్రహ డేటా, వైమానిక ఫోటోగ్రఫీ, డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ మొదలైనవి ఎన్ ఆర్ ఎస్ సీ ద్వారా HYDRAA కు అందుతాయి.
🔶ఉపగ్రహం / వైమానిక వనరుల నుంచి సంబంధిత డేటాను తయారు చేయడం, వాటి ఏకీకరణ, ఆస్తి నిర్వహణ / పర్యవేక్షణ కు సంబంధించిన స‌మాచార సేక‌ర‌ణ‌లో హైడ్రాకు ఎన్ ఆర్ ఎస్ సీ నుంచి అందుతుంది.
🔶NRSC కి చెందిన ‘నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్’ (NDEM) వెబ్ పోర్టల్‌కు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది ఇంటిగ్రేటెడ్ ఏరో-స్పేస్ ఆధారిత విపత్తు డేటాను ఉన్న స్థితిలోనే విజువలైజేషన్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
🔶ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు ఉన్న ప్రాంతంతో పాటు GHMC చుట్టూ ఉన్న 27 మునిసిపాలిటీలు/కార్పొరేషన్ల ప‌రిధిలో చెరువులు, ప్ర‌భుత్వ భూములు, పార్కుల‌కు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారాన్ని సేక‌రించి, విశ్లేషించి సామాన్య ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకు రావ‌డానికి ఎన్ ఆర్ ఎస్ సీ – హైడ్రా సంయుక్తంగా కృషి చేస్తాయి.