TEJA NEWS

సర్వత్రా ఉత్కంఠ – ఓబుళాపురం మైనింగ్ కేసులో నేడే తుది తీర్పు

ఓబుళాపురంలో ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణ, అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు – అటవీ, గనులు-ఖనిజాల చట్టాల కింద సీబీఐ కేసు నమోదు

కోర్టుకు చేరుకున్న గాలి జనార్ధన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి

దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న విచారణ

సుప్రీంకోర్టు ఆదేశాలతో ముగిసిన వాదనలు, నేడు తీర్పు

తీవ్ర సంచలనం సృష్టించిన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం తుది తీర్పు వెలువడనుంది. హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఈరోజు తుది తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో, ఈ కేసులో నిందితులుగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయకుడు అలీ ఖాన్, బీవీ శ్రీనివాసరెడ్డి, ఓఎంసీ కంపెనీ ప్రతినిధులు, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వి.డి. రాజగోపాల్, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందం, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వీరిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను 2009లో సీబీఐకి అప్పగించింది. లోతైన దర్యాప్తు జరిపిన సీబీఐ, 2011లో తొలి ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది. ఆ తర్వాత మిగిలిన నిందితులపై పలు అనుబంధ అభియోగ పత్రాలను దాఖలు చేసింది. మొత్తం తొమ్మిది మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చగా, విచారణ కొనసాగుతుండగానే నిందితుల్లో ఒకరైన లింగారెడ్డి మరణించారు. మరో నిందితురాలైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని 2022లో హైకోర్టు ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది.

ఈ కేసు విచారణను మే నెలలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, సీబీఐ ప్రత్యేక కోర్టు గత నెలలోనే ఇరుపక్షాల వాదనలను ముగించింది. ఈ క్రమంలో మిగిలిన నిందితులపై సీబీఐ కోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. దీంతో దశాబ్దన్నర కాలంగా నలుగుతున్న ఈ కేసులో ఎటువంటి తీర్పు వస్తుందనే దానిపై రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది.