
పేదవారి సంక్షేమం గురించి దేశంలోనే మొదటిసారి ఆలోచించిన మానవతావాది ఎన్టీఆర్ : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
*టిడిపి ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరు
- ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
*పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలన్నదే టిడిపి ఆశయం
*తిరువూరు సమస్య పై స్పందించిన ఎంపి
*కుటుంబంలోనూ చిన్నపాటి వివాదాలు సహజం
అమరావతి : నలభై మూడేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు జాతి ఆత్మగౌరవం దేశవ్యాప్తంగా నిలబెట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు. సమాజమే దేవాలయ-పేద ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం గురించి దేశంలోనే మొదటిసారి ఆలోచించిన మానవతావాది ఎన్టీఆర్ అని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కొనియాడారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాయలంలో శనివారం జరిగిన 43వ టిడిపి ఆవిర్భావ వేడుకలకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) హాజరయ్యారు.టిడిపి కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ జెండా ఎగరవేయగా, జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత లతో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మీడియా తో మాట్లాడారు. సమాజంలోని రాజకీయ అసమానతలను తుడిచిపెడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాధికారం దక్కేలా తెలుగు పార్టీకి అవకాశం కల్పించటంతో పాటు, ప్రజల సంక్షేమానికి తెలుగు దేశం పార్టీ బాటలు వేసిందన్నారు. ఎన్టీఆర్ ఆనాడు అమలు చేసిన ఆస్తిలో స్త్రీలకు హక్కు, పేదలకు పక్కా ఇళ్లు, వృద్ధాప్య ఫించన్లు, పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దు వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సీఎంచంద్రబాబు ,మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని ముందుకి నడిపిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంద్రప్రదేశ్ కి ప్రపంచ పటంలో గుర్తింపు లభించిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి కారణమన్నారు. తెలుగు దేశం పార్టీకి బలం బలగం కార్యకర్తలే అంటూ, వారికి అండగా నిలబడతామన్నారు.
పార్టీ అధిష్టానం చూసుకుంటుంది
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం పై ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) స్పందించారు. తిరువూరు పంచాయతీని పార్టీ అధిష్టానం చూసుకుంటోందన్నారు. ప్రతి కుటుంబంలోనూ చిన్న చిన్న సమస్యలు సహజం అన్నారు. తిరువూరు సమస్యను పార్టీ కుటుంబ సమస్యగా అధిష్టానం భావించి కూర్చొపెట్టి పరిష్కరిస్తుందని తెలిపారు. తిరువూరు వరుస వివాదాలపై పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నియోజకవర్గంలో అందరి అభిప్రాయాలు సేకరించి ఇప్పటికే నివేదిక రూపొందించినట్లు, ఆ నివేదిక ఆధారంగా అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని మీడియా అడిగిన ప్రశ్నకు ఎంపీ కేశినేని శివనాథ్ సమాధానంగా తెలిపారు. తిరువూరు సమస్య పై నివేదిక ఇవ్వాల్సిందిగా అధిష్టానం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీలో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కూడా వున్నారు.
