
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. వాలంటీర్లు ఎవ్వరు లేరు, రెన్యూవల్ చెయ్యలేదని మంత్రి బాల వీరంజనేయ స్వామి చెప్పడంతో సభలో దుమారం మొదలైంది. వాలంటీర్ల తొలగింపు అంశంపై మండలిలో అధికార కూటమి వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీలుగా పరిస్థితి తయారైంది. వాలంటీర్ల తొలగింపు ప్రకటనపై వైసీపీ ఎమ్మెల్సీ లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. వాలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలు కి పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నేడు వలంటీర్ వ్యవస్థనే లేదని చెప్తున్నారు. 2024 సెప్టెంబర్ నెలలో వరదలు వచ్చినప్పుడు ఎలా డ్యూటీ చేయించారు. నవంబర్ 2024 వరకు వాళ్లకి సీ ఎఫ్ ఎం ఎస్ ఐడీలు ఎలా కొనసాగించారో చెప్పాలి. కూటమి ప్రభుత్వం 2,56,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు తొలగించి, వారిని రోడ్డు పడేసింది.
- ఎన్నికల సమయంలో హామీ ఎలా ఇచ్చారన్న వైసీపీ ఎమ్మెల్సీలు
వాలంటీర్లకు 10 వేలు గౌరవ వేతనం చేస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడంపై ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. 2023 ఆగస్టు నుండి రాష్ట్రంలో వలంటీర్లు వ్యవస్థ లేదని దారుణంగా మాట్లాడుతున్నారు. ఆ వ్యవస్థ లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్ల గురించి ఎలా పెట్టారు. 2024 ఏప్రిల్ నెలలో ఎన్నికల ప్రచారం ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారని ప్రభుత్వాన్ని వరుదు కళ్యాణి నిలదీశారు.
జీతం పెంచగానే చించినాడా పుతారేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారు. ఏకంగా 2.6 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించేయడం అన్యాయం అన్నారు. వాలంటీర్లు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి అన్యాయం చేయకూడదని కోరారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. వలంటీర్లు లేకపోతే విపత్తు శాఖ ఎందుకు ఆదేశాలు ఇచ్చిందని ప్రశ్నించారు. లేని వాలంటీర్ వ్యవస్థను వరదల సమయంలో ఎలా వినియోగించారని నిలదీశారు
