Spread the love

నాటి అక్ర‌మాలకు శిక్ష అనుభ‌వించాల్సిందే

జ‌గ‌న్ నీతులు చెబుతుంటే ద‌య్యాలు వేదాలు వ‌ల్లించ‌న‌ట్లుంది

జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌:త‌ప్పులు మీద త‌ప్పులు చేసి, రాష్ట్రాన్ని అంధ‌కారంలో నెట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్ జగన్ నీతులు చెప్తుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి అన్నారు. ఆయ‌న నివాసంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాపాలు ఆ పార్టీ నేతలను నీడలా వెండాడుతున్నాయని, మా నమ్మకం నువ్వే జగన్ అంటూ జగన్ ను నమ్మి వైసీపీ అండలో ఆ పార్టీ నేతలు చేసిన అరాచకాలు, అకృత్యాలు ఒక్కొక్కటి న్యాయస్థానాల ముందుకొస్తున్నాయని వివ‌రించారు.

చట్టబద్ధంగా జరిగే అరెస్ట్‌లను కూడా వక్రీకరిస్తున్నారు

బూతులు తిట్టడం, ఆడవారిని అగౌరవపరచడం, హత్యలు చేయడం, వాటిని డోర్ డెలివరీ చేసి బాధితులకు అందించడం, అలాగే వారి కన్నీటితో రాక్షస ఆనందం పొందడం, కంటికి కనిపించిన భూములను స్వాహా చెయ్యడం, చేతికి అందినంత దోచుకోవడం, దౌర్జన్యాలకు తెగబడడం, రౌడీ ఇజం తో రెచ్చిపోవడం ఇవన్ని ఐదేళ్ల‌కాలంలో వైసీపీ పాల‌న‌లో నిత్య‌కృత్యాలుగా మారాయ‌ని బాలాజి గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ, జ‌న‌సేన పార్టీల నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను నిష్కారణంగా వేధించిన ఆ పార్టీ నాయకులపై నేడు చట్టబద్ధంగా జరిగే అరెస్ట్‌లను కూడా వక్రీకరించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా అక్రమాలు, ఆక్రమణలు చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, కూటమి పాలనలో చట్టాలకు, న్యాయ వ్యవస్థకు గౌరవం ఉంటుందన్నారు. అధికారం కోల్పోయినంత మాత్రాన్న ఎవరు చేసిన నేరాలు, ఘోరాలు మాఫీకావ‌ని, చట్ట ప్రకారమే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిందేన‌ని చెప్పారు. ఇందులో భాగంగానే టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, ఆ కేసులో సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశార‌న్న విష‌యం ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. త‌ప్పు చేసిన వారిని వెనుకేసుకు రావ‌డం స‌రికాద‌ని, త‌ప్పు చేసిన వారు పార్టీలో ఏ స్థాయిలో ఉన్నా శిక్ష అనుభ‌వించాల‌న్న జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను స్పూర్తిగా తీసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.