
ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా.. నిధులు తెస్తా
సంగారెడ్డి, : ఎన్నికలప్పుడే రాజకీయాలు అని.. తర్వాత అందరినీ కలుపుకుని ముందుకెళ్తామని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని తెలిపారు. ఎన్నిసార్లైనా ప్రధాని మోదీని కలుస్తామని.. తెలంగాణకు అవసరమైన నిధులు తీసుకొస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి అ న్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు (శుక్రవారం) జహీరాబాద్ హుగ్గెళ్లిలో బసవేశ్వర విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఆపై కేంద్రీయ విద్యాలయం ప్రారంభించారు. అనంతరం పస్తాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జహీరాబాద్ పారిశ్రామికవాడ భూసేకరణలో అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చిందన్నారు.
భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పెంచామని.. జహీరాబాద్ నిమ్జ్‌లో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని… నిమ్జ్‌లో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. మెదక్ జిల్లా పేరు చెబితేనే ఇందిరమ్మ గుర్తొస్తుంది అని ముఖ్యమంత్రి అన్నారు. మెదక్ ప్రజలను కాంగ్రెస్ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటుందన్నారు. గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్‌గా జహీరాబాద్ కావాలని కృషి చేశామని తెలిపారు. జహీరాబాద్‌కు అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. నారాయణఖేడ్ అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్ష చేస్తామన్నారు. భవిష్యత్‌లోనూ మెదక్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
సింగూరు ప్రాజెక్ట్‌ను ఎకో టూరిజం కింద తీర్చిదిద్దుతామన్నారు. సింగూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులను అప్పుల బాధ నుంచి తప్పించామని.. రైతు భరోసా పథకం అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. గతంలో వరి వేస్తే ఉరే అన్నారని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం రూ.5 వేల కోట్లకు పైగా కేటాయించామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కంకణం కట్టుకున్నామని స్పష్టం చేశారు.
ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాలు బాగుపడతాయని తెలిపారు. ఐదేళ్లలోపు కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. ‘మీరు అండగా ఉండండి… ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది’ అని వెల్లడించారు. గత ప్రభుత్వ నేత అలిగి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారంటూ విమర్శించారు. అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రతిపక్ష నేతల అసెంబ్లీకి రావాలని… సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర, కొండా సురేఖ పాల్గొన్నారు..
