పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘం

TEJA NEWS

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘం
రామగుండం పరిశుభ్రతకు కార్మికులే వెన్నెముక….

— మేయర్ మహంకాళి స్వామి…

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి,రామగుండం/ రామగుండం నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అమోఘమని నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి నగర పాలకవర్గం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.

రామగుండం నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగర పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రతిరోజూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వారు చేస్తున్న కృషిని అభినందించారు.

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి తమ పాలకవర్గం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా సుమారు 400 మంది పారిశుద్ధ్య సిబ్బందికి ఒక్కొక్కరికి రెండు జతల ఏకరూప దుస్తులు, రెండు తువ్వాళ్లు అందజేయనున్నట్లు మేయర్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీపాల్, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top