
శివాజీనగర్ కూరగాయల మార్కెట్లో మార్పు ప్రారంభం కావడం శుభపరిణామం….
–మేయర్ మహంకాళి స్వామి…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:గోదావరిఖని, గోదావరిఖని మార్కెట్లో పరిశుభ్రత, క్రమబద్ధత దిశగా మార్పు ప్రారంభం కావడం సంతోషదాయకమని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.
శివాజీనగర్ కూరగాయల మార్కెట్‌ను సందర్శించి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, వారం రోజుల క్రితం వార్డు పర్యటనలో మార్కెట్‌ను పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని వ్యాపారులకు సూచించగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
మార్కెట్లో వేలాడుతున్న విద్యుత్ తీగలు, తాత్కాలిక పరదాలను తొలగించి రేకులు ఏర్పాటు చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. త్వరలోనే వ్యాపారులు ప్లాట్‌ఫారాలు కూడా నిర్మించుకుని మార్కెట్‌ను మరింత పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
వారం రోజుల క్రితం సుమారు 50 మంది పారిశుధ్య కార్మికులు, జేసీబీ యంత్రాల సహాయంతో మార్కెట్‌ను పూర్తిస్థాయిలో శుభ్రపరిచినట్లు తెలిపారు. వ్యాపారులు చెత్తను బయట పడేయకుండా సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి చెత్తను బహిరంగంగా పారవేసే వారిపై జరిమానాలు విధించడంతో పాటు, అవసరమైతే మార్కెట్ గదుల లీజులు, లైసెన్సులను రద్దు చేసి కొత్త వారికి కేటాయిస్తామని హెచ్చరించారు.
వర్షాకాలం నేపథ్యంలో అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున మాంసం విక్రేతలు పరిశుభ్రత పాటిస్తూ ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరో నాలుగు రోజుల్లో మార్కెట్‌కు అనుసంధానంగా 40 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మేయర్ తెలిపారు.
అనంతరం ఇందిరానగర్, ఎన్టీపీసీ కబ్రస్థాన్, రామగుండం ప్రాంతాల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ ఏఈ మీర్, టీపీఎస్ నవీన్, వర్క్ ఇన్స్పెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
