TEJA NEWS

శ్రీవారిసేవ తరహాలో
“స్విమ్స్ సేవ” ప్రారంభం

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతిలో టీటీడీకి చెందిన శ్రీ వేంకట్వేర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) హాస్పిటల్ లో “స్విమ్స్ సేవ”ను డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్ ప్రారంభం చేశారు. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలోని తిరుమల ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీవారిసేవ తరహాలో స్విమ్స్ లోనూ పేషంట్లు వారి సహాయకులకు త్వరితగతిన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో “స్విమ్స్ సేవ“ను ప్రారంభించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా॥ ఆర్.రామ్ తెలిపారు.
ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ ఆర్.వి.కుమార్ మాట్లాడుతూ టీటీడీలో కొనసాగుతున్న శ్రీవారి సేవ మాదిరిగానే స్విమ్స్ లో కూడా ప్రారంభించాలని స్విమ్స్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ ఐ.వి.సుబ్బారావు, టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బి.ఆర్) నాయుడుల సూచనల మేరకు స్విమ్స్ యూనివర్శిటీలో “స్విమ్స్ సేవ” ప్రారంభించినట్లు తెలిపారు. స్విమ్స్ హాస్పిటల్ లో అందుతున్న 42 విభాగాలకు చెందిన వైద్య సేవలకు గాను వివిధ ప్రాంతాల నుండి రోజుకు సుమారు 1500 మంది పేషెంట్ లు వస్తున్నారని, వీరిలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల వారు కావడంతో వీరికి ఎక్కడ ఏఏ వైద్య సేవలు అందుతున్నాయో తెలియడంలేదని పేర్కొన్నారు.

అందుకోసం పేషెంట్స్ సౌకర్యార్థం స్విమ్స్ మెడికల్ వర్శిటీలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులను ఒక బ్యాచ్ కు 20 మందిని నియమించి సేవలు అందిస్తామన్నారు. వారిని స్విమ్స్ ఓపిడి బ్లాక్, పద్మావతి ఉమెన్స్ హాస్పిటల్ ఓపిడి బ్లాక్ వద్ద పేషంట్ల ఓ.పి. రిజిస్ట్రేషన్, రక్తపరీక్షలు, ఇతర వైద్య పరీక్షల కోసం వచ్చే పేషంట్లకు సహాయ సహకారాలు అందిచడం కోసం ఈ సేవను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ వెంకట కోటిరెడ్డి, ఫిజియోథెరపీ కాలేజీ ప్రిన్సిపాల్ డా॥ మాధవి, మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్స్ మురళీ, శిరీష, పీఆర్వో విభాగం సిబ్బంది అమర్, గణేష్, సుబ్రహ్మణ్యం రెడ్డి, సుందర్, విద్యార్థిని – విద్యార్థులు పాల్గొన్నారు.