
ఏడాదిలో లక్షా 75 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలు లక్ష్యం.
మహిళల ఉపాధికి, నిరుద్యోగ నిర్మూలనకు కృషి.
దివ్యాంగులకు ట్రై సైకిల్స్, వినికిడి పరికరాలు అందజేత
మహిళల ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభించిన మంత్రి సుభాష్.
కాజులూరు, , : మహిళా పారిశ్రామిక వేత్తలే లక్ష్యంగా రాష్ట్రంలో ఏటా లక్ష 75 వేల మంది మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించడమే , కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మహిళల్లో ఆత్మ గౌరవం,ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కాజులూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ, వినికిడి యంత్రాల పంపిణీ, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ, ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాలను మంత్రి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ప్రారంభించి మహిళలలో నైపుణ్యాభివృద్ధిని పెంచే దిశగా కృషి చేస్తుందన్నారు.
రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ వెల్ఫేర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 6 ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటికే రామచంద్రపురంలో 2 కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఒక్కో కేంద్రంలో 120 మంది 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల మహిళలకు 3 నెలలపాటు (90 రోజులు )కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ తరగతులు బ్యాచుల వారీగా ఉదయం, సాయంత్రం ఇస్తామన్నారు. కుట్టు మిషన్ నేర్చుకునే మహిళలు ప్రతిరోజు క్రమం తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. శిక్షణ కేంద్రానికి హాజరయ్యే మహిళలకు ప్రతిరోజు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయడం జరుగుతుందని, కనీసం 75 శాతం హాజరు కలిగిన మహిళలకు శిక్షణ చివరి రోజున కుట్టు మిషన్ ఉచితంగా ఇవ్వడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందన్నారు. అవసరమైతే జిల్లావ్యాప్తంగా ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి కుట్టడానికి బట్టల ఆర్డర్లు శిక్షణ పొందిన మహిళలకు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా బ్యూటీ పార్లర్, ఎంబ్రాయిడరీ కోర్సుల కూడా ఉచితంగా నేర్పిస్తామన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో భర్తలను కోల్పోయిన వారు సుమారుగా 180 మంది వరకు గుర్తించామని అన్నారు. వీరిచేత చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని, 40 సంవత్సరాల లోపు వితంతువులకు ఎంబ్రాయిడరీ కోర్స్ ఉచితంగా నేర్పిస్తూ సి ఎస్ ఆర్ నిధుల ద్వారా రోజుకు రూ.300 రూపాయలు వేతనం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయంలో కూడా మహిళలకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడానికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. త్వరలో రామచంద్రపురం పట్టణంలోని వీఎస్ఎం కళాశాలలో నియోజకవర్గంలోని పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ చదువుకున్న వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ శ్రీనివాస్, జిల్లా సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి పి వేణుగోపాలరావు, కాజులూరు తహసిల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఎంపీడీవో రాంబాబు, అలింకో (ALIMCO ) ప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, లబ్ధిదారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
PRO : కార్మిక శాఖ మాత్యులు.
