Spread the love

శివయ్య లింగం కొట్టేశారండయ్

గుజరాతీయులు గగ్గోలు

గుడితోపాటు గుడిలోని లింగాన్నీ మింగేసే ముఠా.. గుజరాత్ లో శివరాత్రి పర్వదినాన ఓ శివలింగాన్ని ఎత్తుకుపోయారు. అది కూడా శివరాత్రికి ముందురోజు, ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. గుజరాత్ రాష్ట్రం ద్వారక జిల్లాలో అరేబియా సముద్రం ఒడ్డున శ్రీ భిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. పురాతన ఆలయం కావడం, సముద్రం ఒడ్డున ఉండడంతో అక్కడికి భక్తులు రోజూ పెద్దఎత్తున వస్తుంటారు. మహాదేవుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం సముద్ర తీరాన సేద తీరుతుంటారు. అయితే శివరాత్రి సందర్భంగా ఆలయ అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని అలంకరించారు. అనంతరం గుడికి తాళాలు వేసి వెళ్లిపోయారు.

శివరాత్రి సందర్భంగా పూజలు చేసేందుకు బుధవారం తెల్లవారుజామున పూజారి సహా భక్తులు పెద్దఎత్తున ఆలయం వద్దకు వెళ్లారు. అయితే అక్కడ కనిపించిన దృశ్యాలు వారంతా అవాక్కయ్యారు. ఆలయానికి వెళ్లిన పూజారి తలుపులు తీసి గర్భగుడిలోకి వెళ్లారు. అక్కడ శివలింగం లేకపోవడంతో షాక్‌కు గురయ్యారు. పూజారితోపాటు భక్తులూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాగా, అర్ధరాత్రి వేళ ఆలయం లోపలికి ప్రవేశించిన దుండగులు.. శివలింగాన్ని దొంగిలించారు. శివలింగాన్ని పెకలించి ఎత్తుకెళ్లారు. అప్రమత్తమైన పూజారి సమాచారాన్ని వెంటనే దేవదాయశాఖ అధికారులు, పోలీసులకు అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆలయ అధికారులు.. స్కూబా డ్రైవర్ల సహాయంతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. దొంగిలించిన శివుడి ప్రతిమను నీటిలో పడేశారా? లేక పడవగుండా ఎక్కడికైనా తరలించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.