
అందరి సహకారంతో తిరుపతి అభివృద్ధిలో వేగం పెంచుతా
** “తుడ” చైర్మన్ అండ్ టీటీడీ బోర్డు ఎక్స్ అఫీషియో మెంబర్ దివాకర్ రెడ్డి
తిరుపతి: పూర్వజన్మ సుకృతం ద్వారా తిరుమల శ్రీవారికి సేవచేసుకునే మహద్బాగ్యంతో టీటీడీ బోర్డు సభ్యుడిగా, తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ ప్రతినిధిగా తిరుపతి సమూల అభివృద్ధిలో వేగం పెంచుతానని “తుడ” చైర్మన్ అండ్ టీటీడీ బోర్డు ఎక్స్ అఫీషియో మెంబర్ డాక్టర్ “డాలర్స్” దివాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రమాణం చేసిన అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు మహోన్నత తుడ పదవి, కలియుగ దైవం సన్నిధిలో సామాన్యులకు సేవచేసే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్ కు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. భక్తుల సేవే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరినీ కలుపుకొని టీటీడీ అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని చెప్పారు.
ప్రమాణస్వీకారం అనంతరం టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బిఆర్) నాయుడును డాక్టర్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ గా ఉన్న మీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవ చేసే అవకాశం దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. సామాన్య భక్తులకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కలియుగ దైవం ఆశీస్సులతో అందరినీ కలుపుకొని టీటీడీ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తానని చెప్పారు. సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తూ బోర్డు తీసుకున్న నిర్ణయాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి తెలిపారు. టిటిడి చైర్మన్ మాట్లాడుతూ అరుదైన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగేలా శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని టిటిడి చైర్మన్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నేతలు, టీటీడీ బోర్డు సభ్యుడు గుడిపల్లి భానుప్రకాష్ రెడ్డి, తిరుమల అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
