
చౌడవరం శివారులో విషాదం – ప్రేమ జంట ఆత్మహత్యయత్నం, యువకుడు గల్లంతు
పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండల పరిధిలోని చౌడవరం శివారులో ఉన్న కొండ క్వారీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ జంట అర్ధరాత్రి క్వారీ వద్దకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపుతోంది.
అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక యువకుడు, యువతి కలిసి క్వారీ ప్రాంతానికి వెళ్లారు. అర్ధరాత్రి తర్వాత యువతి తిరిగివచ్చినప్పటికీ యువకుడు కనిపించకపోవడంతో అనుమానాలు నెలకొన్నాయి. అనంతరం యువతి చేసిన ప్రకటన ప్రకారం, యువకుడు క్వారీ కుంటలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
తాను కూడా దూకినప్పటికీ స్థానికులు గమనించి కాపాడారని యువతి చెప్పింది. అందిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో యువకుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
యువకుడు స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నట్లు గుర్తించగా, యువతి సమీపంలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు సమాచారం.
