
స్విమ్స్ అభివృద్ధిలో టీటీడీ రాజీ పడదు
ఆస్పత్రి తనిఖీలో టీటీడీ ఛైర్మెన్ రాజగోపాల్ నాయుడు
తిరుపతి: తిరుపతిలో టీటీడీ ద్వారా నిర్వహణ చేపడుతున్న శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) సమూల అభివృద్ధిలోనూ, ఉద్యోగుల సంక్షేమంలోనూ టీటీడీ నుంచి రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బి.ఆర్.నాయుడు) స్పష్టం చేశారు. తద్వారా స్విమ్స్ లో మరింత ఉన్నతంగా వైద్యసేవలు అందిస్తామని చైర్మెన్ నాయుడు తెలిపారు. టీటీడీ ఛైర్మన్ అద్యక్షతన స్విమ్స్ సమావేశ మందిరంలో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అనంతరం ఆయన ఆస్పత్రి విభాగాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రోగుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ స్విమ్స్ లో మరింత ఉన్నతంగా సేవలు అందించేందుకు గత మూడు నెలల నుంచి మాజీ టిటిడి ఈవో ఐవి సుబ్బరావు అధ్యక్షతన వేసిన ప్రత్యేక ఎక్స్ పర్ట్ కమిటీ అధ్యయనం చేసి నివేదికను సమర్పించిందన్నారు. ఈ నివేదికలో మౌళిక సదుపాయాలు, మానవ వనరులు, వైద్య పరికరాలు, ఇంజనీరింగ్ పనులు, మరింత ఉన్నతంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య నిపుణుల సేవలు, నిధుల సేకరణ తదితర అంశాలపై నివేదిక సమర్పించిందన్నారు. ఎక్స్ ఫర్ట్ కమిటీ నివేదికపై రానున్న టీటీడీ బోర్డు మీటింగ్ లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్విమ్స్ అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇస్తున్న ఎక్స్ ఫర్ట్ కమిటీ ఛైర్మెన్ ఐ.వి. సుబ్బారావు, ఇతర సభ్యులను టిటిడి ఛైర్మెన్ కోరారు. ఈవో. శ్యామల రావు మాట్లాడుతూ, స్విమ్స్ చాలా ప్రతిష్టాకమైనదని, 2021లో టీటీడీలోకి స్విమ్స్ ను అప్పగించారని, స్విమ్స్ కు టీటీడీ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని చెప్పారు.
సంవత్సరానికి రూ. 60 కోట్ల గ్రాంట్ తో పాటు ఎంప్లాయ్ హెల్త్ స్కీం, ప్రాణదాన ట్రస్ట్ , వివిధ రకాల ట్రస్ట్ ల ద్వారా సుమారు రూ.100 కోట్లకు పైగా సపోర్ట్ చేస్తున్నామని అన్నారు. స్విమ్స్ అనేది పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్థాపించబడిందని, సంవత్సరానికి 18,000 సర్జరీలు, దాదాపు 4.50 లక్షలకు పైగా ఔట్ పేషెంట్లు, 47వేల ఇన్ పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారని, ఇందులో పేదలే అత్యధికంగా ఉన్నారని తెలిపారు. స్విమ్స్ లో భవిష్యత్ తరాలకు సరిపడేలా ప్లాన్ ప్రకారం నూతన భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, అంకాలజీ, చిన్న పిల్లల హెల్త్ కోసం నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు, ఆంకాలజీని లెవన్ వన్ సెక్టార్ గా తీసుకెళ్లేందుకు , స్విమ్స్ లో ఫ్యాకల్టీ సమస్య, మానవ వనరులు, మౌళిక సదుపాయాల కల్పన, నిర్మాణాలు, నిధుల సమీకరణ, స్వచ్ఛంగా వచ్చే నిపుణులైన వైద్యుల సేవలు తదితర అంశాలు వంటి సమస్యల పరిష్కారం కేసం ఎక్స్ ఫర్ట్ కమిటీ వేశారని, ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై జనరల్ కౌన్సిల్ చర్చించామని పేర్కొన్నారు. స్విమ్స్ లోని అత్యాధునిక వైద్య పరికరాలతో నిర్మితమవుతున్న క్యాన్సర్ భవానాన్ని కూడా ఛైర్మన్ నాయుడు పరిశీలించారు. 391 పడకలు గల నూతన క్యాన్సర్ భవనాన్ని, అందులోని 5 ఆపరేషన్ థియేటర్లను, పరికరాలను పరిశీలించారు. స్విమ్స్ కార్డియో థొరాసిక్ విభాగం శస్త్ర విభాగంలో చికిత్స పొందుతున్న కర్నూలు జిల్లా మంత్రాలయంకు చెందిన అన్నాభాయ్, ప్రకాశం జిల్లా రామాయపాలెం గ్రామానికి చెందిన బి.బన్సికా ఆరోగ్యం, అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా కలిగిరి, కడప జిల్లా ఓబుళవారిపల్లి, చిత్తూరు జిల్లా పాలసముద్రం, తిరుపతి జిల్లా కాళహస్తి ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ రకాల రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎక్స్ ఫర్ట్ కమిటీ సభ్యులు డా. జెఎస్ఎన్ మూర్తి, తేజోమూర్తుల రామోజీ, డా. చెన్నంశెట్టి విజయ్ కుమార్, స్విమ్స్ డైరెక్టర్ డా. ఆర్వీ కుమార్, టీటీడీ బోర్డు మెంబర్ ఎన్. సదాశివరావు, జేఈవో వి. వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ హాజరుకాగా వర్చువల్ గా హెల్త్ స్పెషల్ సిఎస్ ఎం.టి. కృష్ణబాబు, టిటిడి బోర్డు మెంబర్ సుచిత్రా ఎల్లా, ఎండోమెంట్ సెక్రటరీ వినయ్ చంద్ తదితరులు హాజరయ్యారు.
