
బెట్టింగ్ యాప్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో యాంకర్ విష్ణుప్రియ మీద కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసుల విచారణకు హాజరైన విష్ణుప్రియ తాజాగా దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లను క్వాష్ చేయాలంటూ యాంకర్ విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు (మంగళవారం) నాడు విచారణ జరపనుంది.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ వివాదంలో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీల పేర్లు తెర మీదకు వచ్చాయి. వారితో పాటు పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగానే యాంకర్ విష్ణుప్రియతో పాటు పలువురు సెలబ్రిటీల మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విష్ణుప్రియ ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసేవిధంగా విపరీతంగా పోస్టింగ్‌లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం పోలీసులు ఆమెను విచారించారు. విష్ణుప్రియ మొబైల్ కూడా సీజ్ చేశారు.
విచారణలో భాగంగా విష్ణుప్రియ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం భారీ ఎత్తున డబ్బు తీసుకున్నట్లు అంగీకరించారు. మొత్తం 15 బెట్టింగ్ యాప్‌లను ఆమె ప్రమోట్ చేశారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు అంగీకరించారు. ఈ క్రమంలో పోలీసులు విష్ణుప్రియ బ్యాంకు స్టేట్మెంట్‌ను కూడా తీసుకున్నారు. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలని పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియను ఆదేశించారు.
ఇక పంజాగుట్టలో నమోదైన బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటికే 11 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. వారందరికీ కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేశారు. రోజువారి విచారణలో భాగంగా ముగ్గురు ముగ్గురు చొప్పున విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ కేవలం ఇద్దరు మాత్రమే విచారణకు హాజరయ్యారు..
