
విజనరీ ఆలోచనలు, అనుభవమే రాష్ట్రానికి శ్రీరామరక్ష: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్తిపాటి
- రాష్ట్ర పునర్నిర్మాణం, 5కోట్ల ప్రజల సంక్షేమం, సంతృప్తి, సంతోషమే ధ్యేయంగా కేంద్రప్రభుత్వ సహకారంతో చంద్రబాబు రాష్ట్రాన్ని విజన్-2047 దిశగా పరుగులు పెట్టిస్తున్నారు : ప్రత్తిపాటి
- ఆయన మార్గదర్శకత్వంలో పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతల నిర్వహణతో ప్రజాసేవలో భాగమవడం అదృష్టంగా భావిస్తున్నాను : ప్రత్తిపాటి.
“ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, గత పాలకులు విధ్వంసంతో అచేతనావస్థకు చేరిన రాష్ట్రాన్ని, సర్వం కోల్పోయిన ప్రజల్ని రక్షించేందుకు అలుపులేకుండా రేయింబవళ్లు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కి జన్మదిన శుభాకాంక్షలు. 75 ఏళ్ల వయసులో ఆయన పడుతున్న కష్టం, చేస్తున్న శ్రమ అంతా రాష్ట్రప్రగతి కోసమేననే కఠిననిజాన్ని ప్రజలు గ్రహించాలి. ఆయన ఆలోచనలు.. అనుభవమే రాష్ట్రానికి, తమకు శ్రీరామరక్ష అనే సత్యాన్ని గుర్తించాలి. రాష్ట్ర పునర్నిర్మాణమే తన ధ్యేయంగా… 5కోట్ల ఆంధ్రుల సంక్షేమం.. సంతృప్తి.. సంతోషమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వ సహకారంతో కూటమిప్రభుత్వాన్ని విజన్-2047 దిశగా పరుగులు తీయిస్తున్న విజనరీ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
చంద్రబాబు మార్గదర్శకత్వంలో పార్టీలో, ప్రభుత్వంలో పలుకీలక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి, ప్రజల మన్ననలు పొందడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. 2014-19మధ్య వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా, ప్రజలకు ఉత్తమసేవలు అందించే అవకాశం కల్పించిన చంద్రబాబు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఆ రోజులు ఎప్పటికీ నిజంగా నాకెంతో గర్వకారణం. చంద్రబాబు అనే బ్రాండ్ తో నవ్యాంధ్రప్రదేశ్ కచ్చితంగా ప్రపంచం గర్వించేలా నభూతో అనేలా అభివృద్ధి కేంద్రంగా నిలుస్తుందనే ప్రగాఢ నమ్మకం, అచంచల విశ్వాసం నాతో పాటు తెలుగుజాతి మొత్తానికి ఉంది. మంచిప్రభుత్వం అందించే మంచి పాలనతో ప్రజలకు ఇప్పటికే మంచి రోజులు వచ్చాయి.. మున్ముందు వారికందే ప్రభుత్వ ఫలాలు, పాలనా సంస్కరణలు వారి జీవితాల్లో కొత్తవెలుగులు నింపుతాయని గర్వంగా చెప్పగలను.” అని ప్రత్తిపాటి ఒక ప్రకటనలో తెలిపారు.
