
విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు .
-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు .
సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్ధిక చేయూత.
రెడ్డిగూడెం మండలంలోని 15 మందికి రూ.8,79,393లు మంజూరు.
ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం,
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజనరీ లీడర్ అని, చిన్నాభిన్నం అయిన ఏపీ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నారని, సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు లబ్ధిదారులకు అందజేశారు. వీటితోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంపిన సందేశ పత్రాలను కూడా వారికి అందజేశారు.
రెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చెక్కులను అందజేసిన అనంతరం ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
ఎన్.ఎస్.పి మూడవ జోన్ పరిధిలోని టెయిల్ ఎండ్ లో మన ఆయకట్టు ఉందన్నారు. మనకు వాటా ప్రకారం రావాల్సిన సాగర్ జలాలు కూడా ఎగువ నుంచి విడుదల చేయలేదన్నారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితేనే ఇక్కడి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అప్పటివరకు నీటి సౌలభ్యతను బట్టి వరితో పాటు, ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలన్నారు.
విద్యావ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేసి నాణ్యతతో కూడిన విద్యను అందించడానికి మంత్రి నారా లోకేష్ చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేదల బిడ్డలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా తీర్చిదిద్దడానికి లోకేష్ కృషి చేస్తున్నారన్నారు.
సూపర్ సిక్స్ పథకాలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మే నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎమ్మెల్సిగా ఘనవిజయం సాధించడానికి కృషి చేసిన కూటమి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం చంద్రబాబు కి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులను అందజేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
