TEJA NEWS

పవన్ చిన్న కుమారుడిపై అసభ్యకర పోస్ట్‌లు

కేసు నమోదు చేశామన్న గుంటూరు జిల్లాఎస్పీ

విజయవాడలో కూడా మరో కేసు

అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేయంతో ఇంటికి వచ్చేశాడు. చిరంజీవి మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ట్వీట్ చేశారు. ప్రమాదం నుండి కాపాడినందుకు ఆంజనేయ స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే, కొందరు ‘ఎక్స్’లో మార్క్ శంకర్‌పై అసభ్యకర ట్వీట్‌లు చేశారు. దీనిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌ సింగపూర్‌ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటూ ఆస్పత్రిలో వైద్యం అందించిన తర్వాత డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడిపై ‘ఎక్స్‌’లో అభ్యంతరకరంగా ట్వీట్‌లు పెట్టారు.. మాటల్లో చెప్పలేని విధంగా దారుణంగా రాశారు. అయితే దీనిపై ఫిర్యాదు రావడంతో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. ఆ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని.. ఇదే అంశంపై విజయవాడలోనూ కేసు నమోదైనట్లు చెప్పారు. మహిళలు, చిన్నారులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, వ్యక్తిత్వ దూషణకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తెసుకుంటామని హెచ్చరించారు గుంటూరు జిల్లా సతీష్‌కుమార్.

‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడు మార్క్ శంకర్ పై, వారి కుటుంబాన్ని అత్యంత నీచమైన మాటలతో దూషిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్న దుర్మార్గులను, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన తరఫున గుంటూరు జిల్లా SP గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది’ అని జనసేన పార్టీ నేతలు కూడా ట్వీట్‌లు చేశారు. అంతేకాదు ఒక జనసేన కార్యకర్త ఈ అసభ్యకరమైన ట్వీట్‌ అంశాన్ని హోంమంత్రి వంగలపూడి అనితకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం’ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నారు.. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం అక్కడికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్‌లో ఉన్న సంగతి తెలిసిందే.