TEJA NEWS

గత ప్రభుత్వ నిర్ణయంతో మూడు గ్రామాలకు జరిగిన నష్టాన్ని భర్తీచేస్తాం : రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ

పంచాయతీల అభివృద్ధికి నిధుల మంజూరు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ

చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం గణపవరంలో తాగునీటి శాండ్ ఫిల్టర్ బెడ్లు పరిశీలించిన కమిషనర్.

  • బెడ్లు శుభపరిచి ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలని అధికారులకు ఆదేశం
  • మూడు గ్రామాల మున్సిపాలిటీ విలీన సమస్యని నెలరోజులో పరిష్కరించి, ఆయా గ్రామాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్న కృష్ణతేజ
    • గ్రామాల్లోని సమస్యల పరిష్కారంపై అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది వెంటనే దృష్టి పెట్టి గ్రామస్తులకు న్యాయం చేయాలన్న కమిషనర్
    • కృష్ణతేజ ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన గణపవరం, పసుమర్రు, మానుకొండవారి పాలెం గ్రామస్తులు.
  • ఎన్.ఆర్.జీ.ఎస్ బకాయిలు, గోకులం షెడ్ల నిధులు వారంలో విడుదలయ్యేలా చూస్తానన్న కృష్ణతేజ
  • నియోజకవర్గ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవచూపి, నిధులు అందించాలని కోరిన కృష్ణతేజను కోరిన మాజీమంత్రి ప్రత్తిపాటి

గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో నష్టపోయిన నియోజకవర్గంలోని మూడు గ్రామాలను తిరిగి అభివృద్ధి బాట పట్టించేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటానని, ప్రభుత్వ నిధులు పథకాలు కోల్పోయిన ఆయాగ్రామస్తులకు తగిన న్యాయం చేస్తానని రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి నాదెండ్ల మండలంలోని గణవపరం గ్రామంలో పర్యటించిన కృష్ణతేజ ఆ ఊరి వారితో పాటు, పసుమర్రు, మానుకొండవారిపాలెం గ్రామస్తులతో సమావేశమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు. నాదెండ్గ మండలంలోని గణపవరం గ్రామంలోని శాండ్ ఫిల్టర్ బెడ్లు పరిశీలించిన కృష్ణతేజ అవి అపరిశుభ్రంగా నాచుతో ఉండటంపై పంచాయతీ సిబ్బందిని ప్రశ్నించారు. నిధుల సమస్యే గ్రామంలోని అన్ని సమస్యలకు మూలమని గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది కృష్ణతేజకు తెలియచేశారు. తాగునీటి సమస్య తీవ్రత దృష్ట్యా జడ్పీ లేదా ఇతర విభాగాల నిధులతో ఫిల్టర్ బెడ్లు తక్షణమే శుభ్రపరచాలని కృష్ణతేజ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. కొద్దిరోజుల్లోనే సమస్య పరిష్కారం కావాలని, మరలా తాను గ్రామస్తులతో మాట్లాడతానని ఆయన స్పష్టంచేశారు.

మున్సిపాలిటీలో విలీనం వల్లే మూడుగ్రామాలకు సమస్యలు .. కృష్ణతేజకు చెప్పిన గ్రామస్తులు

గణపవరం, మానుకొండవారిపాలెం, పసుమర్రు పంచాయతీలను గత ప్రభుత్వం ఇస్టానుసారం మున్సిపాలిటీలో విలీనం చేయడంవల్ల తమ గ్రామాలు అన్నివిధాల నష్టపోయాయని గ్రామస్తులు కృష్ణతేజకు విన్నవించారు. ఇటు పంచాయతీకి జమకావాల్సిన పన్నులు రావడంలేదని, అటు మున్సిపాలిటీ వారు తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని ప్రజలు కృష్ణతేజకు చెప్పారు. అంతిమంగా 15వ ఆర్థిక సంఘం నిధులుకానీ, ప్రభుత్వం పల్లెలకు కేటాయించే ఇతర నిధులు కానీ దాదాపు రూ.15కోట్లవరకు నష్టపోయినట్టు గ్రామస్తులు కృష్ణతేజకు తెలియచేశారు. ఆఖరికి పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితికి తమ గ్రామాలు రావడంపై వారు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తులు చెప్పింది అంతా విన్న కృష్ణతేజ ముందుగా మూడు గ్రామాల్లో పన్నుల వసూళ్లలోని సాంకేతిక సమస్యల పరిష్కారంపై వెంటనే దృష్టి పెట్టాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. పన్నుల వసూళ్లలోని సాంకేతిక సమస్యలతో పాటు, ప్రజలకు అవసరమైన పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర పథకాల మంజూరుకు కీలకమైన ఆన్ లైన్ వ్యవస్థను సరళతరం చేయాలని, అందుకు అడ్డుగా ఉన్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించాలని సమస్యల పరిష్కారంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కృష్ణతేజ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు., మున్సిపల్ యంత్రాంగం కూడా ఆయాగ్రామాలను నిర్లక్ష్యం చేయడంపై కృష్ణతేజ అసహనం వ్యక్తంచేశారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాలకు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బాథ్యతగల స్థానాల్లో ఉన్న అధికారులు చూస్తూ కూర్చోవడం ఏమిటని కృష్ణతేజ ఆగ్రహం వ్యక్తంచేశారు.

మున్సిపాలిటీలో విలీనం వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటాం

మున్సిపాలిటీలో విలీనం సమస్యలను నెలరోజుల్లో పరిష్కారమయ్యేలా చూస్తానని, ఇన్నాళ్లలో మూడు పంచాయతీలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటామని కృష్ణతేజ ఆయా గ్రామాలవారికి హామీ ఇచ్చారు. అవసరమైతే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అన్నిశాఖల యంత్రాంగాన్ని ఒకేతాటిపైకి తీసుకొచ్చి మూడుగ్రామాల వాసులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆయా గ్రామాల్ని మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల తలెత్తిన సమస్యల్ని స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గతంలోనే తన దృష్టికి తీసుకొచ్చారని, క్షేత్రస్థాయిలో పరిశీలించేవరకు సమస్య తీవ్రతను గ్రహించలేకపోయానని కృష్ణతేజ తెలిపారు. మూడు గ్రామాలకు ఇన్నాళ్లపాటు నిలిచిపోయిన ఎన్.ఆర్.జీ.ఎస్, గోకులం షెడ్ల నిధుల్ని వారంలో విడుదల చేయిస్తామని కృష్ణతేజ హామీఇచ్చారు. చిరుమామిళ్ల గ్రామంలో కోటిరెడ్డి అనే వ్యక్తి వైసీపీ హాయాంలో నీటి వ్యాపారం సాగించి, పంచాయతీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు ఎగ్గొట్టాడని, గ్రామానికి కట్టాల్సిన పన్నులు కూడా కట్టలేదని గ్రామస్తులు కమిషనర్ కృష్ణతేజకు తెలియచేశారు. సమస్యపై స్పందించిన కృష్ణతేజ నిందితుడిపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవచూపాలని కమిషనర్ కు ప్రత్తిపాటి విజ్ఞప్తి

మూడు గ్రామాల సమస్య పరిష్కారంపై స్పష్టత ఇచ్చిన కృష్ణతేజను మాజీమంత్రి ప్రత్తిపాటి ప్రత్యేకంగా అభినందించారు. నియోజకవర్గంలో వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి తగిన సహాయ సహాకారాలు అందించాలని, ప్రత్యేక చొరవచూపాలని ప్రత్తిపాటి కమిషనర్ని కోరారు. ప్రత్తిపాటి కోరికపై కృష్ణతేజ సానుకూలంగా స్పందించారు. తాను ఈ ప్రాంత వాసినేనని ఇక్కడి ప్రజలు తాము ఎదుర్కొనే సమస్యలపై ఎప్పుడైనా తనను కలవవచ్చని ఈసందర్భంగా కృష్ణతేజ గ్రామస్తులకు తెలియచేశారు.

పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ పర్యటనలో డి.పి.ఓ. నాయక్, సి.ఈ.ఓ జ్యోతి బస్, ఏ.ఈ లు, డి.ఈ లు, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఇతర అధికారులు, నాయకులు నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, గంగా శ్రీనివాసరావు, హిమవంత్ రావు, జాలాది సుబ్బారావు, కెల్లంపల్లి ఆచయ్య, కందుల రమణ, గ్రామస్థులు తదితరులున్నారు.