Spread the love

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం సికింద్రాబాద్ లోని తహసిల్దార్ కార్యాలయంలో సికింద్రాబాద్, అమీర్ పేట తహసిల్దార్ మండలాల పరిధిలోని 69 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. సికింద్రాబాద్ తహసిల్దార్ పరిధిలో 37 చేక్కులలో 20 కళ్యాణ లక్ష్మి, 17 షాదీ ముబారక్, అమీర్ పేట తహసిల్దార్ పరిధిలో 15 మంది కి కళ్యాణ లక్ష్మి క్రింద చెక్కులను పంపిణీ చేశారు. చెక్కుల కోసం వచ్చిన పలువురు లబ్దిదారులు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు సారూ అని అధికారులను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల వెంట ఇస్తామన్న తులం బంగారం హామీ అమలుకు నోచుకోలేదని, లబ్దిదారులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా మహిళలకు 2500 రూపాయల ఆర్ధిక సహాయం కూడా అమలు కావడం లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని, లేకుంటే ప్రజల నుండి ప్రభుత్వం పై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురు కానున్నదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, సికింద్రాబాద్ తహసిల్దార్ పాండు నాయక్, అమీర్ పేట తహసిల్దార్ కార్యాలయ అధికారులు కిరణ్ కుమార్, కుమార స్వామి, BRS పార్టీ డివిజన్ అద్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు ప్రేమ్ కుమార్, శేఖర్, లక్ష్మీపతి, కూతురు నర్సింహ, రాజేష్ ముదిరాజ్, ఆంజనేయులు, మహేష్ యాదవ్, బలరాం, జమీర్, నోమాన్, వనం శ్రీనివాస్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

వాస్తవానికి దూరంగా రాష్ట్ర బడ్జెట్…..తలసాని

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉన్నదని, అది తూతూ బడ్జెట్ అని మాజీ మంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం సికింద్రాబాద్ లోని తహసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గత సంవత్సరం బడ్జెట్ లో ప్రకటించిన నిధులలో ఎంత మేర ఖర్చు పెట్టారో కూడా ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాద్యత ప్రభుత్వం ఉందన్నారు. KCR ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనే కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో పొందుపర్చడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు గత బడ్జెట్ లో కూడా ప్రకటించారని, ఎక్కడ ఇచ్చారో చూపిస్తారా అని ప్రశ్నించారు. అధికారం కోసం అనేక రకాల హామీలు ఇచ్చి ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించారని, అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా హామీలు అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. వరద ముంపు సమస్య పరిష్కారం కోసం నాలాలలో పూడిక తొలగింపు పనులకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు పూడిక తొలగింపు పనులు ప్రారంభించలేదని, ఇంకెప్పుడు చేపడతారని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, త్రాగునీటికి కటకట ఏర్పడిందని, ట్యాంకర్ లే దిక్కు అన్నట్లుగా పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వం ఊక దంపుడు ప్రసంగాలను మానుకోవాలని హితవు పలికారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని చెప్పారు.