Spread the love

ప్రజల సహకారంతోనే స్వచ్ఛ చిలకలూరిపేట సాకారం. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గ్రహించాలి : మాజీమంత్రి ప్రత్తిపాటి.

  • ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు వివరించి, ప్రజలకు స్వయంగా జూట్ సంచులు పంపిణీ చేసిన మాజీమంత్రి : ప్రత్తిపాటి. రోగాలు, వ్యాధులు రాకుండా ఉండాలంటే చుట్టూ ఉండే వాతావరణం స్వచ్ఛంగా ఉండాలి : ప్రత్తిపాటి…

ప్రజలు స్వచ్ఛాంధ్ర : స్వచ్ఛ చిలకలూరిపేట కార్యక్రమాన్ని తమ బాధ్యతగా భావించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, తడి-పొడిచెత్తను వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శనివారం పట్టణంలోని కళామందిర్ సెంటర్లో జరిగిన స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన మాజీమంత్రి ప్రత్తిపాటి, స్థానిక గాంధీ పార్క్ ఆవరణలో చెత్తను తొలగించడంతో పాటు, స్థానిక మార్కెట్లో తిరుగుతూ, వ్యర్థాలను రోడ్లపై వేయడంవల్ల కలిగే అనర్థాలను వ్యాపారులు, ప్రజలకు తెలియచేశారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని దశలవారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ దిశగా పట్టణ మున్సిపల్, పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. స్వయంగా జూట్ క్యారీ బ్యాగులను పంపిణీ చేసిమరీ, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రత్తిపాటి ప్రజలకు తెలియచేశారు. ప్లాస్టిక్ తో పాటు చెత్తను రోడ్లపై వేయకుండా ప్రజలు తమకు తాముగా ఆలోచించుకునేలా వినూత్నంగా వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. డ్వాక్రా, మెప్మా సిబ్బంది ప్రజలతో మాట్లాడి, స్వచ్ఛ చిలకలూరిపేట లక్ష్యాలను వారికి వివరించాలన్నారు, ప్రజలు సహకరిస్తే రాష్ట్రంలోనే చిలకలూరిపేట మున్సిపాలిటీ స్వచ్చాంధ్రలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. ఒకప్పుడు చిలకలూరిపేట మున్సిపాలిటీ రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలిచిందని, అప్పటి మున్సిపల్ కమిషనర్ బెస్ట్ కమిషనర్ గా అవార్డు కూడా తీసుకున్నారని, ఆ స్ఫూర్తితో ఇప్పుడున్న కమిషనర్ చిత్తశుద్ధితో పనిచేయాలని పుల్లారావు సూచించారు. పచ్చదనానికి కూడా మున్సిపల్ అధికారులు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. డివైడర్ల మధ్యలో, రోడ్లపక్కన నాటిన మొక్కలు ఎండలకు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్లు, డ్రైనేజ్ ల్లో చెత్త లేకుండా చూడాలని, దోమల నివారణపై దృష్టిపెట్టాలని, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారుల్ని మాజీమంత్రి ఆదేశించారు. కొన్ని చోట్ల మందుబాబులు వీధిదీపాలు పగలగొడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయని, వారిని గుర్తించి పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని ఖాళీస్థలాల్లో చెత్తవేయడం తమకే ఇబ్బంది అనేది ప్రజలు గుర్తించాలని, స్థలాల యజమానులతో మాట్లాడి మున్సిపల్ అధికారులు అవి శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటించి పోలీస్ వారికి సహకరించాలని ప్రత్తిపాటి సూచించారు.

సూర్య ఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి, సౌర విద్యుత్ వినియోగంలో చిలకలూరిపేట రాష్ట్రంలోనే ముందుండేలా అధికారులు కృషిచేయాలి : ప్రత్తిపాటి

సూర్య ఘర్ పథకంలో భాగంగా ఇంటి పైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే దిశగా ప్రజలు ఆలోచించాలని ప్రత్తిపాటి సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి ఉచితంగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయన్నారు. బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి తోడు రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలు ఇవ్వనుందన్నారు. సూర్యఘర్ పథకం విధి విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించి, లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు చొరవ చూపాలని మాజీమంత్రి తెలిపారు. సూర్య ఘర్ పథకం అమలుకు సిద్ధమైన ప్రజలకు అవసరమైతే అదనపు రాయితీలు ఇచ్చేలా ప్రభుత్వంతో తానే స్వయంగా మాట్లాడతానని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, కమిషనర్ శ్రీహరి, మున్సిపల్ అధికారులు, పట్టణ సీఐ రమేష్ బాబు, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరిముల్లా, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమద్ ఖాన్ , మద్దు మాల రవి, మున్సిపల్ కౌన్సిలర్ లు మరియు మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.