
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి.. బాధిత కుటుంబానికి రూ. 9 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం.
2009 జూన్ 13న కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా ఢీకొట్టిన బస్సు
రూ. 9 కోట్ల పరిహారం ఇప్పించాలని సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్‌లో కేసు వేసిన మహిళ భర్త
రూ. 8.05 కోట్ల పరిహారం చెల్లించాలని 2014లో తీర్పు
హైకోర్టులో సవాలు చేసిన ఆర్టీసీ యాజమాన్యం
రూ. 5.75 కోట్లకు తగ్గించి తీర్పు చెప్పిన తెలంగాణ హైకోర్టు
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన బాధిత మహిళ భర్త
ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పిన సుప్రీం ధర్మాసనం
బస్సు ఢీకొనడంతో మృతి చెందిన మహిళ కుటుంబానికి 9 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. లక్ష్మి నాగళ్ల అనే మహిళ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. స్వదేశం వచ్చిన ఆమె 2009 జూన్ 13న భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో లక్ష్మి మృతి చెందారు. ఈ నేపథ్యంలో తన భార్య మృతికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ. 9 కోట్ల పరిహారం ఇప్పించాలని మృతురాలి భర్త శ్యాంప్రసాద్ నాగళ్ల సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్‌లో కేసు వేశారు.
వాదనలు విన్న ట్రైబ్యునల్ రూ. 8.05 కోట్ల పరిహారం చెల్లించాలని 2014లో ఆర్టీసీని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆర్టీసీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం పరిహారాన్ని రూ. 5.75 కోట్లకు తగ్గించి తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పును మృతురాలి భర్త సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
తన భార్య అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి, అక్కడ శాశ్వత నివాసిగా ఉందని, నెలకు రూ. 11,600 డాలర్లు సంపాదిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ. 9 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరారు. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం నిన్న ఈ కేసును విచారించింది. బాధిత కుటుంబానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. లక్ష్మి కుటుంబానికి రూ. 9,64,52,220 చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
