Spread the love

నోటి ప‌రిశుభ్ర‌త‌ను పాటించాలి

ప్ర‌భుత్వాసుప‌త్రిలో వ‌ర‌ల్డ్ ఓర‌ల్ హెల్త్ డే

చిల‌క‌లూరిపేట‌ నోటి సంబంధ వ్యాధులు రాకుండా ప్ర‌తి ఒక్క‌రూ రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాల‌ని, నోటిని ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని ప్ర‌భుత్వాసుప‌త్రి సుప‌రిండెంటెండ్ డాక్ట‌ర్ ల‌క్ష్మీకుమారి చెప్పారు. ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వాసుప‌త్రిలో దంత‌వైద్యురాలు డాక్ట‌ర్ భాగ్య‌మ్మ ఆధ్వ‌ర్యంలో వ‌ర‌ల్డ్ ఓర‌ల్ హెల్ట్ డే ను నిర్వ‌హించారు. ముందుగా రోగుల‌కు ఓర‌ల్ క్యాన్స‌ర్ స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆసుప‌త్రి లో ఉన్న రోగులు, పారిశుధ్య కార్మికుల‌కు, ఆశావ‌ర్క‌ర్ల‌కు నోటి ప‌రిశుభ్ర‌త గురించి అవ‌గాహన క‌ల్పించారు. ఈ సంద‌ర్బంగా నోటి ప‌రిశుభ్ర‌త‌పై అవ‌గాహ‌న ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా దంత‌వైద్యురాలు డాక్ట‌ర్ భాగ్య‌మ్మ మాట్లాడుతూ నోరు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత ఆరోగ్యవంతంగా ఉంటామ‌ని, నోరు ప‌రిశుభ్రంగా లేక‌పోతే నోటిలో ఎన్నో రకాల సూక్ష్మజీవులు తిష్టవేసి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయ‌న్నారు. నోటి ఆరోగ్యం ఎంత బాగుంటుందో అంతగా వ్యాధులు రాకుండా చూసుకోవచ్చుని, నోరు, దంతాలు, నాలుక, చిగుళ్లు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని వెల్ల‌డించారు. ఎక్కువ మొత్తంలో చక్కెర వినియోగం, పొగాకు నమలడం, మద్యం సేవించడం, సరైన పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో నోటి ఆరోగ్యం దెబ్బతింటున్నదని చెప్పారు.కార్య‌క్ర‌మంలో ఆసుప‌త్రి వైద్యులు డాక్ట‌ర్ అమృత‌, ఆసుప‌త్రి సిబ్బంది పాల్గొన్నారు.