
మా గుండెచప్పుడు నువ్వే రాజన్నా…
** తిరుపతిలో వైఎస్సార్ జయంతి వేడుకల్లో భూమన
తిరుపతి: ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఊరంతా నీ జ్ఞాపకాలే రాజన్నా.. ఏ పల్లెకు వెళ్లినా.. పట్టణానికి వచ్చినా నీ ప్రతిరూపాలే.. నీ పథకాలు పదిలం.. నిన్ను మేము మరువలేం! జోహార్ వైఎస్సార్… జోహార్…. అంటూ అభిమానులు చెమర్చిన కళ్లతో తమ అభిమాన నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ యడుగూరి సందింటి (వైఎస్) రాజశేఖర్రెడ్డి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నీవు మా మధ్య లేకపోయినా మా గుండె చప్పుడు మొత్తం నువ్వే రాజన్నా…. అంటూ స్మరించుకున్నారు. మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖర్రెడ్డి 76వ జయంతిని పురష్కరించుకుని
తిరుపతి తుడా సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహాం వద్ద చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం. మేయర్ డాక్టర్ శిరీష యాదవ్, వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ రెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డిలతో పాటు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు గజమాలలతో ఘనంగా నివాళు లర్పించారు. వైఎస్సార్ ప్లకార్డులను చేతపట్టుకుని జోహార్ వైఎస్సార్, జోహార్…. అంటూ నినదించారు. అనంతరం 76 కేజీల భారీ కేక్ ను కట్చేసి అందరికి పంచిపెట్టారు. అనంతరం వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఉదయివంశీ ఆధ్వర్యంలో సుమారు వందమందికి పైగా రక్తదానం చేశారు. అనంతరం వెయ్యిమందికి పైగా పేదలకు భూమన కరుణాకరరెడ్డి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ పేదప్రజల ఆశాజ్యోతి మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖర్రెడ్డి అని, తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరికి కూడ వెరవకుండా ప్రజలకు సేవ చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రతి పేదవాడికి అందించిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. పేదప్రజల ఆశాజ్యోతి అయిన వైఎస్సార్ బౌతికంగా మన మధ్య లేకపోయినా పేదప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవించే ఉన్నారన్నారు. వైఎస్సార్ 76వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ రోజు వైఎస్సార్ సీపీ ఓడిపోయిందని కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలు, విధ్వంసాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని దౌర్జన్యాలు చేయించినా తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలబడుతామన్నారు. దాంతో పాటు ప్రజల పక్షాన నిలబడి చంద్రబాబు చేసే ఆకృత్యాలను ఎదిరిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపైన దౌర్జన్యాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ సంస్థల చైర్మెన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
