పోలీస్ గ్రీవెన్స్ కు 123 ఫిర్యాదులు
తిరుపతి:
తిరుపతి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వయంగా విని, అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలపై ఎస్పీ ప్రత్యక్షంగా విచారణ జరిపి, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ చట్టపరమైన పరిష్కారం తక్షణం అందించాలనీ, ఫిర్యాదుల పరిష్కారంలో ఏ ఆలస్యం చేయరాదని స్పష్టంగా ఆదేశించారు.
నడవలేని స్థితిలో వచ్చిన వారు, దివ్యాంగులు వ్యక్తిగతంగా హాజరు కావడం కష్టమైన సందర్భాల్లో — ఎస్పీ స్వయంగా వారి వద్దకు వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించి, సంబంధిత పోలీసు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ “ప్రతి పోలీసు అధికారి ప్రజల సమస్యలను గౌరవంగా విని, బాధ్యతతో పరిష్కరించాలి. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి ఆలస్యం జరగకూడదు,” అని అన్నారు. అలాగే జిల్లా కార్యాలయానికి రాలేని ప్రజలు తమ స్థానిక పోలీస్ స్టేషన్, సర్కిల్ లేదా సబ్‌డివిజన్ కార్యాలయాల ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని, ఆ ఫిర్యాదులు కూడా “మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో భాగంగా పరిగణించి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎస్పీ సంబంధిత అధికారులకు “చట్టపరమైన చర్యలు తీసుకున్న వెంటనే వివరాలతో కూడిన నివేదికలను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలి” అని ఆదేశించారు.
మొత్తం 123 ఫిర్యాదులు స్వీకరించబడగా, వాటిని సంబంధిత అధికారులకు అప్పగించి, సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శాంతి భద్రతలు – రవిమనోహరచారి, రామకృష్ణ – తిరుమల, సీఐలు, ఇతర పోలీసులు పాల్గొన్నారు.
