బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగ్ తాజా నివేదికలో గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలను ప్రస్తావించింది.
ఒకే బైక్‌పై 126 గొర్రెలు తీసుకొచ్చినట్లు రికార్డులు ఉన్నట్లు పేర్కొంది. కారులో 168, అంబులెన్స్ లో 84, ఆటోలో 126 గొర్రెలు రవాణా చేసినట్టు కాగ్ నివేదికలో తేలింది. అంబులెన్సులోనూ గొర్రెలు తరలించినట్లు రికార్డులో తెలపడం విస్మయానికి గురి చేసింది. కారు, బస్సుల్లోనూ గొర్రెలు తీసుకెళ్లినట్లు రికార్డులు ఉండటం సంచలనంగా మారింది.�
జీవాలను కొనకుండానే కొన్నట్లు లెక్కలు చూపినట్లు కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. చనిపోయిన వారికి గొర్రెలు పంపిణీ చేసినట్లు రికార్డులు తయారు చేసినట్లు పేర్కొంది. ఈ స్కీంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయినట్లు కాగ్ తేల్చింది. రూ.253.93 కోట్ల వినియోగంపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నకిలీ రవాణా ఇన్వాయిస్‌లతో రూ.68 కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ తేల్చింది. గొర్రెలకు నకిలీ ట్యాగ్‌లతో రూ.92 కోట్లు స్వాహా చేసినట్లు పేర్కొంది. ఇక కాగ్ తాజా రిపోర్టులో కాళేశ్వరంలో అవకతవకలు, ఆసరా పింఛన్ల నిధులు దారి మళ్లింపు వంటి అంశాలను ప్రస్తావించింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భారీ అవకతవకలపై కారు పార్టీ రియాక్షన్ ఎలా ఉండబోతుందన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది.