26న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి
కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు
కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముఖ్యంగా రైతుకు మద్దతు ధర, మూడు నల్ల చట్టాలు, లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ఈనెల 26న జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం పిలుపునిచ్చింది. స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం జరిగింది. దొండపాటి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ 2022 సంవత్సరంలో మహాత్తర రైతాంగ పోరాటం సందర్భంగా రైతులకు కనీస మద్దతు ధర ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మరిచిపోయినట్లు వ్యవహరిస్తుందన్నారు.
మూడు సాగు చట్టాలను ఉప సంహరించుకున్నట్లు ప్రకటించినప్పటికీ దొడ్డిదారిన అమలు చేసేందుకు మోడీ సర్కార్ పూసుకుంటుందని ఆరోపించారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకు వచ్చారని -వాటిని రద్దు చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఏ మంత్రి వర్గ సమావేశంలోనూ వ్యవసాయ కార్మికుల గురించి ప్రభుత్వం ఆలోచన చేసినది లేదన్నారు. ముఖ్యంగా రైతు, కార్మిక, వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడి జరుగుతుందని ఈ ముట్టడిలో పెద్ద ఎత్తున వివిధ సంఘాల నేతలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘాల నాయకులు బొంతు రాంబాబు, బందెల వెంకయ్య, కార్మిక సంఘాల నాయకులు తోట రామాంజనేయులు, గాదె లక్ష్మి నారాయణ, రావి శివరామకృష్ణ, ఎండివై పాషా, కళ్యాణం వెంకటేశ్వరరావు, జి.
-రామయ్య, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు తాటి వెంకటేశ్వరరావు, మెరుగు సత్యనారాయణ, యర్రా శ్రీనివాసరావు, తిమ్మిడి హన్మంతరావు, లక్ష్మి నారాయణ, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.