TEJA NEWS

నన్ను ఎందుకు టార్గెట్ చేశారు’ అంటూ అసెంబ్లీలో సబిత కంటతడి..!!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. సభ ప్రారంభం కాగానే.. ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా.. అది కాస్త ఎక్కడెక్కడికో పోయింది. మొదట.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులుగా సుమారు గంటకుపైగానే సభ నడవగా ఆ తర్వాత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావన వచ్చింది. సభలో పార్టీ మార్పులపై వాడి వేడిగా చర్చ నడుస్తుండగా పెద్ద రచ్చే అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సబితా ఇంద్రారెడ్డి టార్గె‌ట్‌గా ఇవాళ అరగంటపాటు శాసనసభ సమావేశాలు జరగడం గమనార్హం. ఈ క్రమంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ కౌంటర్ల వర్షం కురిపించారు.

సబిత ఏమన్నారు..?

‘అక్కడ ఉన్న వారు (కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూపిస్తూ..) ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరారో చర్చిద్దాం. నన్ను ఎందుకు టార్గెట్ చేశారు..?. నేను ఏం మోసం చేశాను..? ఎవరిని ముంచాను..?. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించింది నేనే. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని మాట్లాడితే, నన్ను టార్గెట్ చేశారు’ అని సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఇలా ఒకట్రెండు విషయాలే చాలానే మాట్లాడారు మాజీ మంత్రి. ఈ క్రమంలోనే స్పీకర్ కలుగజేసుకుని సభా నాయకుడిని అగౌరవ పరుస్తున్నారని సబితకు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌లో సబితా అనుభవించిన పదవులు మొత్తం అన్నీ ప్రస్తావించారు. ఈ క్రమంలో ఎమోషనల్‌‌కు లోనైన సబిత.. కంటతడి పెట్టేశారు!

సబితా.. సబబేనా..!?

‘2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి అనేక పదవులు ఇచ్చింది. కానీ.. సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరి మోసం చేశారు. ఒక దశాబ్ద కాలం సబితకి మంత్రి పదవి ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే సబిత బీఆర్ఎస్‌లోకి వెళ్ళారు. కాంగ్రెస్ నన్ను సీఎల్పీ లీడర్ చేస్తే నా వెనక ఉండాల్సింది పోయి పదవి కోసం సబిత పార్టీ మారారు. ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసేందుకు సబిత పార్టీ పదవి వెళ్లారు. పార్టీలు మారి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది గాక ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు. అసలు సబిత ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదు’ అని భట్టీ ప్రశ్నలు, అంతకుమించి విమర్శల వర్షం కురిపించారు.

ఇదేందక్కా..!

భట్టీ మాట్లాడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేశారు. సబితా ఇంద్రారెడ్డిని సబితక్కా అని సంబోదిస్తూనే ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చర్చ ఉంటుంది. వ్యక్తిగతంగా జరిగిన చర్చను సబితక్క సభలో పెట్టారు. నువ్వు కాంగ్రెస్‌లోకి వస్తే ముఖ్యమంత్రిని అవుతానని సబితక్క నాకు చెప్పారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయమని నాకు సబితక్క చెప్పి ఆమె మాత్రం టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. నన్ను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పాను. నేను చెప్పే మాట నిజమా..? కాదా..? అని సబితక్క గుండెపై చేయి వేసుకొని చెప్పాలి’ అని రేవంత్ గట్టిగానే మాట్లాడారు. ప్రసంగం ముగించిన రేవంత్.. కొత్త గవర్నర్‌ను రిసీవ్ చేసుకొని తిరిగొచ్చి మిగిలిన విషయాలు, మిగిలిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతానని బయటికెళ్లారు. ఈ క్రమంలోనే స్పీకర్ ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. ‘కేటీఆర్ గారు రెచ్చగొట్టడమే మన పనా..?’ అంటూ కోపంగా స్పీకర్ మాట్లాడారు..


TEJA NEWS