మోదీ 3.0లో మధ్య తరగతి మందహాసం!
మోదీ 3.0 సర్కారు పాలనలో మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలు అమలు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని
మోదీ 3.0 సర్కారు పాలనలో మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలు అమలు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ 100 రోజుల పాలనలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. మోదీ సర్కారు మూడోసారి కొలువుదీరి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అమిత్ షా, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వెల్లడించారు. తొలి 100 రోజుల్లోనే 14 రంగాల్లో రూ.15 లక్షల కోట్ల విలువైన పాలసీలను అమలు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా రూ.30,700 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామన్నారు. రూ.28,600 కోట్ల పెట్టుబడితో 12 పారిశ్రామిక కారిడార్లకు ఆమోదం తెలిపామని.. తద్వారా అంతర్జాతీయ తయారీ రంగానికి భారత్ కేంద్ర బిందువుగా మారనుందని చెప్పారు. ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు పబ్లిక్ పరీక్ష చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఆదాయ పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ గృహ నిర్మాణ రంగానికి రూ.2.30 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు.