వైసీపీలో మారో వికెట్ డౌన్?.. చంద్రబాబును కలవనున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరణ
టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట
ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న ఎంపీ
శివ శంకర్. చలువాది
ఏపీలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు వ్యవహారం అధికార వైసీపీలో వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ లకు సీటు లేదంటూ పార్టీ నాయకత్వం స్పష్టంగా చెప్పేసింది. టికెట్ రాదనే క్లారిటీ వచ్చిన నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈసారి టికెట్ దక్కకపోవచ్చే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో మాగుంటను జగన్ కనీసం పలకరించకపోవడం దీనికి నిదర్శనం.
ఈ నేపథ్యంలో, మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈరోజు హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో మాగుంట భేటీ అవుతున్నట్టు సమాచారం. పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం ఢిల్లీ నుంచి మాగుంట నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. చంద్రబాబుతో చర్చల సందర్భంగా టీడీపీ సీటుపై హామీ వచ్చిన తర్వాత… ఆ పార్టీలో చేరే విషయాన్ని మాగుంట ఒంగోలులో అధికారికంగా ప్రకటిస్తారు.