TEJA NEWS

జిలేబీలతో సంబరాలు మొదలుపెట్టి..

మంగళవారం ఓట్ల లెక్కింపు తొలిరౌండ్లలో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతున్నట్టు ఫలితాలు రావడంతో ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలు జిలేబీలు పంచుకుంటూ సందడి చేశారు. అయితే ఆ తర్వాత రౌండ్లలో బీజేపీ దూసుకెళ్లడంతో జిలేబీలు పంచుకోవడం బీజేపీ వంతైంది. బీజేపీ ప్రధాన కార్యాలయానికి పెద్దఎత్తున జిలేబీలకు ఆర్డర్ కూడా ఇచ్చారు.

రాహుల్ ఎన్నికల ప్రచారాస్త్రం…

కాగా, హర్యానాలోని గోహనలో తయారయ్యే మాతూరాం ‘జిలేబీ’లకు చాలా ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా జిలేబీల ప్రస్తావన చేస్తూ, పెద్దఎత్తున ఈ జిలేబీలను దేశవ్యాప్తంగా తయారు చేసి అమ్మకాలు జరపాలని, విదేశాలకు సైతం వీటిని సరఫరా చేయాలని అన్నారు. జిలేబీ ఫ్యాక్టరీతో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మాధూరాం జిలేబీలను ఇతర రాష్ట్రాలకు అమ్మడం, విదేశాలకు ఎగుమతి చేస్తే ఆయన ఫ్యాక్టరీలో ఒక రోజుకు 20,000 వేల మందిని 50,000 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. మాతూరాం వంటి వ్యాపారులు కేంద్ర ప్రభుత్వ పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ చర్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. అయితే రాహుల్ చెప్పిన జిలేబీ ఫ్యాక్టరీపై బీజేపీ ఛలోక్తులు విసిరింది. జిలేబీలు వేడివేడిగా తయారు చేస్తారని, అసలు ఆ స్వీట్ తయారీ ఎలాగో కూడా కూడా రాహుల్‌కు తెలియదని విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెలలో హర్యానాలో జరిపిన ఎన్నికల ప్రచారలోనూ గోహన జిలేబి ప్రస్తావన చేశారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే వారివద్ద ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను మార్చే ఫార్ములా ఉందని, మన మాతూరాం జిలేబీకి కూడా ప్రధాని పదవి ఇస్తారేమో అడగాలని మోదీ చమత్కరించారు.

ఈ జిలేబీ ప్రత్యేకత ఏమిటంటే..?

గోహనా జిలేబీని 1958లో దివంగత మాతూరాం ప్రారంభించారు. ఇప్పుడు ఆ వ్యాపారాన్ని ఆయన మనుమలు రామన్ గుప్తా, నీరజ్ గుప్తా నడుపుతున్నారు. దేశవాళీ నెయ్యితో ఈ జిలేబీ తయరు చేస్తారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలే చాలా మెత్తగా ఉంటుంది. 250 గ్రాముల బరువుతో నాలుగు బిలేబీల బాక్సు రూ.320కి అమ్ముతారు. వారం రోజుల పాటు ఈ స్వీట్ నిల్వ కూడా ఉంటుంది. గోహనాలో చాలా పెద్ద ఆహారధాన్యాల మార్కెట్ ఉండటంతో ఇక్కడి రైతులు రోజంతా పొలంపనుల్లో శ్రమిస్తుంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వీరు సేద్యం మానరు. దేశవాళీ నెయ్యితో తయారు చేసే ఈ పెద్ద జిలేబీలు వారికి అవసరమైన కేలరీలను ఇస్తుందని, ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉండటంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేందుకు వారు వీటిపై ఎక్కువ మక్కువ చూపుతారని రామన్ గుప్తా తెలిపారు. మొదట్లో చిన్న దుకాణంగా ఉండే వీరి వ్యాపారం ఆ తర్వాత బాగా విస్తరించింది. ప్రముఖ రాజకీయ నేతలు సైతం గోహనా వైపు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇక్కడకు వచ్చి జిలేబీలు పెద్దఎత్తున ఆర్డర్ ఇస్తుంటారు..


TEJA NEWS