శంకర్పల్లిలో కలగానే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల
ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచని పాలకుల హామీ
ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు
శంకర్పల్లి: శంకర్పల్లి మండల పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని పాలకులు ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం జనరల్ సెక్రెటరీ వడ్ల కృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మండల, మున్సిపాల్టీకి చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో వివిధ రాష్ట్రాల విద్యార్థులు వచ్చి చదువుకుంటుంటే..
స్థానిక విద్యార్థులకు మాత్రం కనీసం ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులో లేకపోవడం గమనార్హం. ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు చెల్లించే స్థోమత లేక పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం.. మరిచిపోవడం నేతలకు పరిపాటిగా మారింది. 2004, 2009, 2014, 2019, 2023 ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. మండల, మున్సిపల్ పరిధిలో ప్రతీ ఏటా ఎంతో మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు.