TEJA NEWS

మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయాలను పక్కాగా నిర్వహించి,అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులకు ఆదేశించారు.

    కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గద్వాల, ఐజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు మంజూరైన నిధులు, వాటి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. 15వ ఫైనాన్స్, సీఎం అష్యూరెన్స్ ఫండ్, పన్నులు, గృహ నిర్మాణ అనుమతులు, ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన ఆదాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ఆదాయాన్ని సరైన అకౌంటింగ్ ప్రక్రియలతో నిర్వహించి, చార్టెడ్
అకౌంటెంట్ల ద్వారా ఎప్పటికప్పుడు ఆడిట్ చేయించాలన్నారు. నిధులను ఇతర పనులకు మళ్లించకుండా పద్ధతి ప్రకారం ఖర్చు చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల వేగవంతం వివిధ స్కీముల నుండి వచ్చిన నిధుల ద్వారా చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ నిధుల కింద చేపట్టిన మరుగుదొడ్లు,పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేపట్టిన పనులను త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని, పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వారం వరకు నిధుల వివరాలను సమగ్రంగా అందజేయాలని సూచించారు.

 ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు, మున్సిపల్ కమిషనర్లు, డిఇలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.

TEJA NEWS