యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఉద్యోగ నియామక దరఖాస్తు ఫారాలపైనా జీఎస్టీ వసూలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. అగ్నివీర్‌తో సహా మిగిలిన ఉద్యోగ నియామకాల దరఖాస్తు ఫారాలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తోందని ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కల్యాణ్ సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లోని పలు ఖాళీల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను షేర్ చేసి పోస్టు చేశారు.
అందులో దరఖాస్తు ఫీజుతో పాటు దానిపై జీఎస్టీ వేసిన విషయాన్ని ప్రస్తావించారు. నోటిఫికేషన్‌లో అన్ రిజర్వ్‌డ్, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీల వారికి 1,000, ఎస్సీ/ఎస్టీలకు రూ.600 దరఖాస్తు ఫీజు ఉండగా.. దానిపై జీఎస్టీ 18% ఉంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చెమటోడ్చి తమ పిల్లలను చదివిస్తున్నారని, కానీ బీజేపీ ప్రభుత్వం వారి కలలను కల్లలు చేస్తోందని ప్రియాంక విమర్శించారు. కేంద్రం పేదల ఆశలను పెట్టుబడిగా మార్చుకుంటోందని దుయ్యబట్టారు. ఫీజు కట్టి పరీక్షలు రాస్తే, చివరికి పేపర్ లీకేజీలతో అవినీతి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.