
ఓ కులాన్ని దూషిస్తే..రాష్ట్రానికి సీఎం అయిపోతారా?
వివాదాస్పదంగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు
రేవంత్ సర్కార్‌కి తలనొప్పిగా ఎమ్మెల్సీ
మల్లన్న దూకుడు యాదృచ్ఛికంగా..తెరవెనక మంత్రాంగమా?
తెలంగాణలో కమల వికాసానికి కులాల లెక్కలు నిజమేనా?
తీన్మార్ మల్లన్న వెనక రేవంత్ ఉన్నారా?
……………………………………………………………..
అధికారపక్ష ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి రోజురోజుకి వివాదాస్పదంగా మారుతోంది.స్వంత పార్టీ నేతలనే ఆయన టార్గెట్ చేస్తున్నారు.అన్నింటికన్నా ముఖ్యంగా కొన్ని కులాలను నేరుగా ప్రస్తావిస్తూ తిట్లదండకం చదువుతున్నారు.వచ్చే ఎన్నికల్లో బీసీ వర్గాల నుంచే రాష్ట్రానికి సీఎం కాబోతున్నారంటూ బహిరంగ వేదికల మీద మాట్లాడుతున్నారు.రాష్ట్రానికి బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రి కావాలని నినదించడంలో ఎలాంటి తప్పులేదు.రాష్ట్రానికి బలహీన వర్గాల నుంచి సీఎం పీఠం మీద కూర్చోవాల్సిందే.ఇలాంటి డిమాండ్ న్యాయమైందే.అయితే ఓ కులం నుంచి ముఖ్యమంత్రి కావాలంటే ఇంకో కులాన్ని కించపర్చడం,దుర్భాషలాడటం చేస్తే సాధ్యపడుతుందా? అనే ప్రశ్నకు తీన్మార్ మల్లనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.అన్ని కులాల వారు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు.
అన్ని వర్గాల నాయకులు అన్ని పార్టీలో వివిధ హోదాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కులాల కుంపటి పెట్టి ఒక కులాన్ని బహిరంగ వేదికల మీద దూషిస్తే మిగతా కులాలన్నీ ఏకమై తమకు అనుకూలంగా మారుతాయనే బ్రమ గతంలో కొంతమంది నాయకులు చేసి విఫలమైన సంగతి ఎన్నోసార్లు చూశాం.బహుషా ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా గతంలో విఫలమైన ఫార్ములానే వచ్చే ఎన్నికల్లో అమలు చేసి విజయవంతం కావలనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ..గత కొన్ని రోజులుగా ఆయన నోటి నుంచి కొన్ని కులాల మీద దురుసు మాటలు విన్పిస్తున్నాయి.బీసీ నినాదం వేరు..కుల దూషణ వేరు..బీసీలు,ఎస్సీలు లేదా ఇతర ఏ వర్గాలకైనా అన్ని విధాల న్యాయం కావాలంటే అంతా ఐక్యం కావాల్సిందే.పోరుబాట పట్టాల్సిందే.అయితే ఒక కులాన్ని టార్గెట్ చేసి దూషిస్తే మిగతా కులాలన్నీ ఐక్యమైతే తాము గొప్ప నేతగా ఎదుగడానికి ఉపయోగపడుతుందనే భావనే తప్పు.
ఇలాంటి ఆలోచన ఎవరిలో ఉన్నా అది పూర్తిగా ప్రమాదకర ధోరణే అవుతుంది తప్ప హర్షిందగ్గ పరిణామం కానేకాదు.ఇప్పుడు తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి కూడా ప్రమాదకర ధోరణిలో వెళుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.ఒక జర్నలిస్టుగా ఉండి రాజకీయ ఆరంగ్రేటం చేసిన తీన్మార్ మల్లన్న రాష్ట్రానికి సీఎం కావాలని అనుకుంటున్నారు కావచ్చు.ఇందుకోసం ఆయన బీసీ నినాదం ఎత్తుకున్నారు కావచ్చు..ఇందులో ఎలాంటి తప్పులేదు.ఆయన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎంచుకున్న మార్గాన్ని ప్రశ్నించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ఒక రాష్ట్రానికి నాయకుడు అవ్వాలంటే అన్నివర్గాలను ఆకట్టుకునేలా పంథానే రాజమార్గం.ఇప్పుడు తీన్మార్ మల్లన్న దూషిస్తున్న కులం నుంచి కూడా ఆయనకు అభిమానులున్నారు.ప్రభుత్వాలను ప్రశ్నిచే సందర్భంలో తీన్మార్ మల్లన్నకు అన్ని వర్గాలు,కులాల నుంచి గతంలో మద్దతు దక్కిన విషయం గమనించాలి.ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించడంలో అన్ని కులాల వారు ఓట్లేస్తేనే సాధ్యపడిరది. మరి అలాంటప్పుడు తీన్మార్ మల్లన్న కుల దూషణ కావాలనే చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న కావాలనే ఓ కుల నేతలు టార్గెట్ చేస్తున్నారు.దీని వెనక ఏదో మర్మం ఉందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని గత కొద్ది రోజులుగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం అనేక రాజకీయ ఎత్తుగడలను వేస్తోంది. కులాల సమీకరణలతోపాటు కొన్ని వర్గాల నేతలను ముగ్గులోకి లాగే వ్యవహారం నడుస్తోంది.వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడానికి కొన్ని కులాల లెక్కలతో కమలం కదులుతోందనేది కాదనలేని సత్యం.
ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.ఆది నుంచి కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న వర్గాలను,కులాలను హస్తానికి దూరం చేసే వ్యూహంలో కమలనాథులు ఉన్నట్లుగా సమాచారం.వచ్చే ఎన్నికలనాటికి కాంగ్రెస్‌ను కులాల లెక్కలతో ఉక్కిరిబిక్కిరి చేసి వీలైతే బీఆర్‌ఎస్‌తో కూటమి కట్టి బీజేపీ జెండాను రెపరెపలాడిరచే ఎత్తుగడ ఒకటి కాగా…కారు పార్టీ దారికి రాని పక్షంలో కేసులతో ఇరుకునపెడితే కాంగ్రెస్ ఎలాగూ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుంది కావున రాష్ట్రంలో కమలం జెండా పాతటం తేలికేననేది మరో వ్యూహం.ఇలాంటి ఎత్తుగడల్లో భాగంగానే తీన్మార్ మల్లన్న ఓ కులాన్ని, మరో వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారనే అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి.ఇదిలా ఉంటే తీన్మార్ మల్లన్న వెనక సీఎం రేవంత్ రెడ్డే ఉన్నారనే అనుమానం కూడా కొందరి నుంచి వ్యక్తమవుతోంది.తన సీఎం కుర్చీకి ఎసరు తెచ్చే మంత్రులను,బలమైన వర్గాలను ఇరుకున పెట్టడానికి తీన్మార్ మల్లన్నని అస్త్రంగా వాడుతున్నారనే ప్రచారం కూడా బలంగా ఉంది.ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి రేవంత్ సర్కార్‌కి తలనొప్పిగా మారిందంటున్నారు.కాంగ్రెస్ పార్టీకి మొదట నుంచి వెన్నెముకగా ఉన్న కొన్ని కులాలు ఇప్పుడు తీన్మార్ మల్లన్న వ్యవహారశైలితో దూరమయ్యే ప్రమాదం ఉందంటున్నారు.అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ విధానాన్నే నిత్యం తప్పుపడుతున్న తీన్మార్ మల్లన్నతో పార్టీకి తీరని డ్యామేజ్ ఏర్పడుతోందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.వెంటనే తీన్మార్ మల్లన్న వ్యవహారానికి పుల్‌స్టాఫ్ పెట్టకపోతే తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.సీఎం రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న వ్యవహారంలో ఉదాసీనతగా ఉండటం పార్టీలోని మెజార్టీ వర్గాలకు రుచించడం లేదు.పార్టీ విధానాలు,నిర్ణయాలకు ఎవరు భిన్నంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో మరిన్ని నిరసన గళాలు విన్పించి పార్టీ కట్టు తప్పే ప్రమాదం ఉందంటున్నారు.తాజాగా తీన్మార్ మల్లన్న హన్మకొండ బీసీ యుద్ధ భేరీ సభలో ఓ కులాన్ని కించపర్చుతూ మాట్లాడారని ఆయన మీద రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.అన్ని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు.ఈ రగడ ఇప్పుడు ఎటు దారితీస్తుందోననే ఆందోళన ఉంది.ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాజకీయ ఎదుగుదలకు ఆయనకు అన్నివర్గాల మద్దతు అవసరమే.ఏ వర్గాన్నో..ఏ కులాన్నో కించపర్చి ద్వేషిస్తే ఆయన లక్ష్యం నెరవేరదు.మరి ఈ విషయాన్ని తీన్మార్ మల్లన్న గుర్తెరగాలి.కులాల దూషణ ఎన్నటికీ ప్రమాదకర ధోరణే.ఈ ధోరణిలో ఎవరున్నా అది పూర్తిగా సమర్థనీయం కాదు.
