
ప్రియుడితో కలిసి మొగుడికి చెక్..!
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య
హత్య కేసును చేదించిన షాద్ నగర్ పోలీసులు
ప్రియుడుతో కలిసి భర్తను హతమార్చి డ్రామా
షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్ సిహెచ్ రంగస్వామి
ఇద్దరు అరెస్ట్ – ఆటో, వేట కొడవలి సీజ్
రిమాండ్ కు తరలింపు
తమ అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని సొంత భర్తనే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన సంచలనం రేకెత్తించింది. భర్తను హతమార్చి చివరకు తానే పోలీసులకు కనిపించడం లేదని ఫిర్యాదు చేసి పోలీసులకు సైతం ట్విస్ట్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసిపి) ఎన్ సిహెచ్ రంగస్వామి తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి
భర్తను హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు
ఫరూక్ నగర్ మండలం చిన్న చిల్కమర్రి గ్రామానికి చెందిన ముద్దునోళ్ల ఎరుకలి మౌనిక తన భర్త ఎరుకలి యాదయ్య (32) గత ఫిబ్రవరి 19వ తేదీన కనిపించకుండా పోయాడని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో మౌనిక ఫిర్యాదు చేసింది. పట్టణ విజయ్ కుమార్ ఎఫ్ఐఆర్ నెంబర్ 205/ 2025 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అక్రమ సంబంధం నేపథ్యంలో..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, స్థానిక ఏసిపి సిహెచ్ రంగస్వామి ఆధ్వర్యంలో పట్టణ సీఐ విజయ్ కుమార్ ఎస్సైసుశీల, హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్, సిబ్బంది సువర్ణ నరేందర్ రాజేష్ కరుణాకర్ ల బృందం ఈ కేసులో విచారణ మొదలుపెట్టినట్లు ఎసిపి రంగస్వామి తెలిపారు. అయితే ఈ కేసులో ఎరుకలి మౌనికకు ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామానికి చెందిన ఎరుకలి అశోక్ (ఆటో డ్రైవర్) తో అక్రమ సంబంధం సాగుతోంది. 8 సంవత్సరాల క్రితం ఎరుకలి మౌనికతో యాదయ్యకు వివాహం జరిగింది. మృతుడికి ఇద్దరు పిల్లలు. మృతుడు కూలి పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో మందు తాగుతూ ఇంటి అవసరాలకు డబ్బులు ఇవ్వకుండా సంసారం విషయంలో ఎరుకలి మౌనికకు తరచు గొడవ జరిగేది. చిలకమర్రి గ్రామం పక్కన గల రాఘవేంద్ర పత్తి కంపెనీలో పనికి వెళ్తున్న మౌనికకు అదే కంపెనీలో ఆటో డ్రైవర్ గా పని చేసే ఎరుకలి అశోక్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసిందని ఏసీపి తెలిపారు. మౌనిక భర్త యాదయ్య తరచూ కొడుతున్నాడన్న సమాచారంతో అశోక్, మౌనికలు కలిసి తమ అక్రమ సంబంధానికి అడ్డు లేకుండా చేయాలని ఉద్దేశంతో ఫిబ్రవరి 18వ తేదీన సాయంత్రం ఏడు గంటల సమయంలో అశోక్ మృతుడు యాదయ్యను తన బాబాయి యొక్క ఊరు రామంజపూర్ లో విందు ఉందని వెంట తీసుకువెళ్లాడు. యాదయ్య మౌనికలను ఆటోలో తీసుకెళ్లిన అశోక్ రాత్రి 11 గంటల సమయంలో గూడూరు గ్రామం పెద్దగట్టు తాండ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆటో నిలిపి నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి బాగా మద్యం తాగించారు. బాగా మద్యం తాగిన యాదయ్య నిధుల్లోకి జారుకోగానే ఒక వేట కొడవలితో మృతుడి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అంతేకాకుండా తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను అతనిపై పోసి శవాన్ని కాల్చినట్లు ఎసిపి రంగస్వామి తెలిపారు.
దొరికారు ఇలా..
నేరం జరిగాక ఇరుకలి మౌనిక అశోక్ లు పట్టణంలోని అయ్యప్ప కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారనీ ఎసిపి పేర్కొన్నారు. వీరిపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ఏప్రిల్ 23వ తేదీన ఇరువురిని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తడబడి ఉన్న వాస్తవ విషయాలను ఒప్పుకున్నారు అని ఏసిపి తెలిపారు. ఈ సందర్భంగా ఎక్కడ హత్య చేసి శవాన్ని పాతిపెట్టారు అక్కడికి నేరస్తులను తీసుకువెళ్లి వాస్తవాలు తెలుసుకున్నట్లు ఏసీపి తెలిపారు.
అప్పటికే శవం పూర్తిగా ఎముకల గూడుగా మిగిలిందని సదరు ఎముకలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఒక ఆటో, వేట కొడవలి హత్యకు ఉపయోగించిన వస్తువులను సీజ్ చేసినట్లు ఏసీపి రంగస్వామి తెలిపారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఎరుకలి యాదయ్యను దారుణంగా హతమార్చి చంపారని, నిందితులు నేరం ఒప్పుకోవడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు రంగస్వామి తెలిపారు. ఈ కేసులో చాకచకంగా పనిచేసిన సీఐ విజయ్ కుమార్, ఎస్సై సుశీల, హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్ సిబ్బంది సువర్ణ నరేందర్ రాజేష్ కరుణాకర్ లకు తగిన రివార్డులను ఇప్పించేందుకు పై అధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు..
