Wasteful removal of pond water for fish.
చేపలకోసం చెరువు నీటిని వృథాగా తొలగింపు.
చేపలు పట్టేందుకు అక్రమార్కులు చెరువులను ఖాళీ చేసేస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటుతున్న తరుణంలో నీటిని వృథాగా విడిచిపెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సూర్యాపేట మండలంలోని టేకుమట్ల (వెంకటాపురం) చెరువులో చేపలు పట్టేందుకు నీటిని తూముల గుండా, భారీ మోటార్ల సహాయంతో తొలగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా నీటిని వదలడంతో చెరువులో నీటి నిల్వ సగానికి కంటే ఎక్కువగా తగ్గిపోయినా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతి ఏడాది రైతులకు ఎంతగానో ఉపయోగపడే చెరువు నుండి నీటిని తొలగించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పశువులు కూడా చెరువు నీటితోనే దాహం తీర్చుకుంటున్నాయి. ఇంత ఉపయోగకరం ఉన్న చెరువు నీరు వృథాగా పోతున్నా అధికార యంత్రాంగానికి గ్రామస్థులు అనేకసార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నీటిని వృథాగా పోకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.