మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్….

TEJA NEWS

మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్….

–పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం గర్రెపల్లి సామాజిక సంక్షేమ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు సుల్తానాబాద్ సీఐ రంజిత్ కుమార్, ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణతో ఉండటం అభినందనీయమని అన్నారు. విద్యార్థుల్లో మంచి విలువలు, క్రమశిక్షణ ఉన్నప్పుడు వారు ఎప్పటికీ మత్తు పదార్థాల బారిన పడరని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అభినందించారు.

విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. తమ గ్రామాలు, కాలనీలు, పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ‘మాదకద్రవ్యాల వ్యతిరేక సైనికులు’గా ముందుండాలని పిలుపునిచ్చారు.

మత్తు పదార్థాలు మొదట ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, అనంతరం వ్యసనంగా మారి వ్యక్తి ఆరోగ్యం, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల శారీరక, మానసిక సమస్యలతో పాటు కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజంలో ఎక్కడైనా ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం కష్టపడి పనిచేయాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర శ్రమతోనే ఉన్నతాధికారులు, క్రీడాకారులు, కళాకారులు, నాయకులుగా ఎదగగలరని అన్నారు. లక్ష్యంపై దృష్టి సారించి కృషి చేస్తే ప్రతి విద్యార్థి విజయాన్ని సాధించగలడని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ రంజిత్ కుమార్, పెద్దపల్లి మాదకద్రవ్యాల నిరోధక బృందం ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, ఎస్సై చంద్రకుమార్, జూలపల్లి ఎస్సై మల్లేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top