ప్రభుత్వ భూముల సర్వే వేగవంతం చేసి అర్హులకు పట్టాల పంపిణీ పూర్తి చేయాలి…

TEJA NEWS

ప్రభుత్వ భూముల సర్వే వేగవంతం చేసి అర్హులకు పట్టాల పంపిణీ పూర్తి చేయాలి…

–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: కాల్వ శ్రీరాంపూర్, ఇదివరకు అర్హులైన పేదలకు కేటాయించిన ప్రభుత్వ స్థలాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వ భూముల సర్వేను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్, ఎంపీడీవో, తహసీల్దార్ తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెన్నంపల్లి గ్రామంలోని ప్రభుత్వ భూముల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన పేదలకు గతంలో కేటాయించిన ప్రభుత్వ స్థలాలకు పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించాలని పేర్కొన్నారు.

పెద్దంపేట గ్రామంలో గోదాం నిర్మాణం కోసం గుర్తించిన 10 ఎకరాల భూమికి సంబంధించిన ప్రక్రియను త్వరగా పూర్తి చేసి భూమిని ఖరారు చేయాలని ఆదేశించారు. మండలంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపీడీవోకు సూచించారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద చేపడుతున్న సీసీ రోడ్ల పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని, అందుబాటులో ఉన్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, నరేగా పనులకు సంబంధించిన బిల్లులు త్వరలో విడుదల కానున్నందున పనులను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

అనంతరం ముత్తారం మండలంలోని ఓడేడు శివారులో ఉన్న వెంకటేశ్వర్లపల్లి గ్రామ పరిధిలోని సీలింగ్ భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భూముల స్థితిగతులను సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ డా. రాముడు, ముత్తారం తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ ఇంచార్జ్ ఎంపీడీవో దివ్యదర్శన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top