
రామగుండం అభివృద్ధికి, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరిన మేయర్ మహంకాళి స్వామి…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, రామగుండం నగర సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించాలని పురపాలక పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి.కె. శ్రీదేవిని రామగుండం మేయర్ మహంకాళి స్వామి కోరారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఓ హోటల్లో మంగళవారం మునిసిపల్ ఛైర్మన్లు, మేయర్లకు నిర్వహించిన ఓరియెంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టి.కె. శ్రీదేవిని మేయర్ మహంకాళి స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రామగుండం నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆమెకు వివరించినట్లు మేయర్ తెలిపారు. ముఖ్యంగా ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బయో మైనింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని కోరినట్లు చెప్పారు.
అలాగే వ్యర్థ పదార్థాలను వినియోగించి వినూత్న వస్తువులు తయారు చేసే “వేస్ట్ టు వండర్” యూనిట్లను స్వశక్తి మహిళా సంఘాల ద్వారా స్థాపించేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
నగర ప్రజలకు మరింత మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరగా, ఈ అంశాలపై పురపాలక శాఖ సెక్రెటరీ టి.కె. శ్రీదేవి సానుకూలంగా స్పందించినట్లు మేయర్ మహంకాళి స్వామి వెల్లడించారు.