
100% స్వచ్ఛత సాధనే లక్ష్యంగా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి.::అసిస్ట్ డైరెక్టర్ డాక్టర్ జాస్తి రంగారావు.
ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఐటిసి మరియు అసిస్ట్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు బంగారు భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత మౌలిక వసతుల కల్పన, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు ఎంఈఓ ఎం.వి నాగరత్నం అధ్యక్షత వహించగా మండలంలోని అన్ని పాఠశాలల హెచ్ఎంలు ఈ శిక్షణలో పాల్గొని పాఠశాలల ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్తులో ఆయా పాఠశాలల్లో చేయదగ్గ మార్పులు చేర్పులు స్వచ్ఛత నిర్వహణపై అవగాహన కల్పించారు.ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అసిస్ట్ డైరెక్టర్ డాక్టర్ జాస్తి రంగారావు మాట్లాడుతూ పాఠశాలల్లో 100% స్వచ్ఛత సాధనే లక్ష్యంగా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎడ్లపాడు మండలంలో లింగారావుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మోడల్ హబ్బుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇదేవిధంగా మండలంలోని మిగిలిన అన్ని ప్రభుత్వ పాఠశాలలు రూపొందించేలా తమ వంతు సహకారం అందిస్తామన్నారు.ఇందుకు ఐటిసి సహకారంతో అసిస్ట్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో లింగారావుపాలెం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం కే వెంకట రామిరెడ్డి,అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ డిప్యూటీ డైరెక్టర్ పావులూరి రవిబాబు, కోఆర్డినేటర్లు డేవిడ్,వెంకయ్య కార్యకర్తలు అన్ని పాఠశాల హెచ్ఎంలు పాల్గొన్నారు.
